నారీశక్తి
నారీశక్తి
నారీశక్తి.
(వచన కవిత )
పురుషాధిక్య భావనతో పులుకు పులుకు మంటూ
కఱకుఱాతి గుండెతో కసరి కసరి నన్ను తిట్టుకొంటూ.
బానిసగా నీ క్రింద బ్రతకాలని పాడుబుద్ధితో కనలి
దీననై నీ యడుగులకు మడుగు లొత్తాలని కమిలి
చూపులేని కబోదివై చూస్తే జీవితాన మిగిలేదేమిటి?
కాపురంలో కలతలు వస్తుంటే నిలిచి యుండేదేమిటి?
గౌరవించటం నేర్చుకో!కాలమేవిధి మారిందో తెలుసుకో!
నారీశక్తికి ఎదురు లేదని ఇప్పుడైనా నీ నడత మార్చుకో!
చదువులలో సమానులం! సమర్థతతో పోటీ పడతాం!
కదిపి చూడు!మా పుణ్య చరితను నీ కెఱింగించుతాం!
వివిధ విషయాలు నేర్చిన ఘనతర విదుషీమణులం!
భవితవ్యాన్ని శాసించి వసుధ నేలగల మహారాణులం!
ముద్దుగా చూసుకొంటే చాలు! భోగభాగ్యాలు కురిపిస్తాం!
బుద్దిగా మెలిగితే చాలు! మేమీ భూభారాన్ని మోస్తుంటాం!
నెమ్మితో జ్ఞానాన్ని సముపార్జించుకో!చైతన్యాన్ని నిలుపుకో!
నిమ్మళంగా మసలుకో! అనురాగముతో నన్ను దరి చేర్చుకో!
సమయం మించి పోలేదు! లెక్కవేయకు నెక్కువ తక్కువలు.
మమకారంతో సాగుదాం! గృహంలో కురియు సర్వ సంపదలు.//
