స్నేహం
స్నేహం
వేకువ జామున ప్రశాంతంగా గోదారి తీరం కెరటాల..
ముంగురుల అంచులను మృదువుగా తాకుతూ వయ్యారంగా..
గగన జఘన సొగసుతో తుళ్ళింతల కేరింతలతో సాగుతోంది..
సూరీడు లేలేత కిరణాలతో వెలుగును పంచుతుంటే..
సిగ్గుపడి తీరం బాహువుల కౌగిలిని సుతారంగా వదిలించుకుని..
నల్లని కురులలో మల్లెల మాలికలా మెరిసింది..
కోటి లింగాల రేపులో హరోంహర
నామస్మరణతో భక్తజనం..
గోదారిలో మునకలేసి పునీతమైన భక్తుల పాదాల స్పర్శతో..
పులకించిపోయా అహల్యా
శాప విమోచనంలా ఒకింత గర్వంతో.. జాలరులు పడవలను నాపై నమ్మకంతో కట్టేస్తే..
మూగ ఊసులాడుతు స్వేచ్ఛ కోసం పరితపించే లేగదూడలా..
తల్లి ప్రేమ కోసం తపనల ఊయలలో తేలిపోతున్నవి..
నాతో చిరు ఆటలు ఆడిన చిన్ని మొక్కలు..
నేడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా స్నేహం మరువని..
వృక్షరాజాల నీడతో కొండంత ఓదార్పు నిస్తున్నాయి చిత్రంగా..!
