కాలం చెల్లిన మాట
కాలం చెల్లిన మాట
ఏదైనా కాలానుగుణంగానే కొలమానం
ఒక మాటైనా, బతుకు బాటైనా ప్రమాణం
కాలం మారేకొద్దీ మారేటి జీవన విధానం
దేనికైనా ఓ నిర్దిష్ట సమయమే అనుకూలం
కాలం చెల్లిన మాటలతో ఎంతో కొంత కష్టం
పాతొక రోత, కొత్తొక వింతనేది నేడు ఇష్టం
ప్రపంచీకరణతో కొత్త సంస్కృతి పరిపాటి
గతమంతా కాలం చెల్లిందనేది సూటిపోటి
నేటి జెన్ జీల చేతుల్లో నయా కృత్రిమ మేధ
కొత్త కొత్త ఆవిష్కరణలతో ఏదో కొంత బాధ
నయా నిర్వచనాలతో నయా నయా విలువలు
ఉరుకుల పరుగులతో సాఫ్ట్ వేర్ కొలువులు
మొన్న, ఆమొన్న నిన్నటికి కాలం చెల్లిన దినం
నిన్నటి రోజు నేటికి ఒక కాలం చెల్లిన గతం
మరి నేడు, రేపు భవిష్యత్తుకు తీరిన ఋణం
అందుకే ప్రతిదీ పాత చింతకాయలా ఘ్రాణం
తాతముత్తాతల ఆలోచనలు కాలం చెల్లినవి
అదే నేటి తల్లిదండ్రులు రేపటి తాతముత్తాతలు
ఒకరి దృక్పథాలు మరొకరికి పొసగని తత్వాలు
కాలం చెల్లిన వాటికి దూరంగా నేటి వ్యక్తులు
పెద్దల మాటే శాసనం అన్న నాటి యుగం
పుస్తకాలలోనే మిగిలి, వెలిసిన ప్రయోగం
ఇప్పుడు నేటి జెన్ జీ పిల్లలు ప్రశ్నిస్తున్నారు
మనిషిని మనిషిగా చూడటం తప్పా అని ?
కాలం మారింది, కానీ కొన్ని మాటలు మారలే
మార్పు తలుపు తట్టినా, పగులగొట్టినా చేరలే
తెరవని పాత తాళాల్లా మిగిలిపోయిన మరలే
కాలం చెల్లినవి మరుగుననున్నా మరవనివే
గౌరవం పేరుతో గతాన్ని మోసుకెళ్లడం కాదు
నేటి యువత చెడును ప్రశ్నించడం నేర్చుకోవాలి
ఎందుకంటే కొత్త సమాజం మార్చే నయా సంధి
అసంబద్ధ గత గతాన్ని మార్చుటకు నాంది !
