శ్రీనివాసుని సన్నిధి
శ్రీనివాసుని సన్నిధి
స్వామి కోవెల సన్నిధి సంపదలకు
నిలయమైయుండు
సిరిదొర నెమ్మి చూపు.
శ్రీహరి ప్రసాదంబులన్
జేతబట్టి
భక్తులందరు పొందగా పరవశంబు
శ్రీనివాసుని కొల్వగా సిద్ధి కలుగు
రక్షనొసగును కొండల రాయుడొకడె.
కలియుగంబున దైవమై కాపుకాయు
వేంకటేశుడు మాకున్న వెతలు తీర్చు.
కరుణ కల్గిన దేవర కరము చాచి
నెయ్యుడైవచ్చు మావెంట నీడ వోలె.
నడిచి వచ్చితి మీవేళ నమ్మకముగ
నేడు కొండల నెక్కుచు వేడు కొనుచు.
మ్రొక్కు లన్నియు చెల్లించి ముడుపు తీర్చి
స్వామి కిత్తుము మాకున్న సంపదలను.
శ్రీనివాసుడు నిత్యుడై శ్రేయమొసగు
భక్త వరదుడు మా పాలి ముక్తి దాత /
