శిశిరమల్లే
శిశిరమల్లే
శిశిరమల్లే నీవు చూస్తే మనసుకొమ్మే వాడుతున్నది
ఆశలన్నీ నేల రాలగ కంటి చెమ్మే జారుతున్నది...
మాయచేసే మాటలెన్నో చాలు చాలిక గారడీలే
సోయతప్పిన మనసుచూడూ దిక్కుతోచక కుములుతున్నది..
గుండెగుబులుకి చిక్కువీడదు మొక్కుబడిగా మాటలాడితె...
గుండె గొంతుక విప్పనీయక ప్రేమకోటను కూల్చుతున్నది..
దోషమేదో పాపమేదో శోకనీడలు శాపమైనవి
ఉప్పెనల్లే ముంచునేమో మౌనసంద్రం మరుగుతున్నది
అలలుచెక్కిన కలల తీరం తిరిగితానే చెరుపు కున్నవి...
మనసునిండిన నీదురూపం కన్నుదోయిని కాల్చుతున్నది
చెదిరిపోయిన వర్తమానం కుదుట పడునా ఒక్కనాటికి...
ముదిరిపోయిన భేషజాలకు హృదయమంతా బెదురు తున్నది...
సుజాతమయ్యే దారిఒక్కటి ఎదురుపడదా ప్రయత్నిస్తే..
నిజాలన్నీ నిరూపించే క్షణముకొఱకై వెతుకుతున్నది..

