రంగస్థలం
రంగస్థలం
రంగస్థలమే పూదోట
రంగస్థలమే స్మశాన స్థలి
పూయక తప్పదు
రాలక తప్పదు!
మనకంటూ ఇక్కడేమి మిగిలింది
నేల జలలో ఇమిడిపోయిన
కాసిన్ని కన్నీటి చుక్కలు!
మనిషికి కట్టిన పాడె
తనవారు మోసే జ్ఞాపకాల కాడె
అదైనా శాశ్వతమా!
రాలిన పూల తావి
వికాసం ఎంత కాలం
ఎండిన పూలతో మాలల్లగలరా!
కొన్ని తరాల పిమ్మట విచ్ఛిన్నమై...
గాలి రేణువుల్లో కనుమరుగయ్యే
శుష్క దేహాలే కదా స్మృతులూ అంటే!
