ఒంగోలు (గిత్త ) జాతి పశువులు
ఒంగోలు (గిత్త ) జాతి పశువులు
శివుని వాహనమైన నంది జాతిపశువులు
నవనవలాడు దేహకాంతితో నడకలు
రాజసమొలికించెడివీ రతనాల రాశులు
తేజముతో నలరారు దిట్టమైన జీవులు
ఒంగోలు గిత్తలు భారత కీర్తిప్రదీప్తులు.
వన్నె చిన్నెలనొలికించు బంగారు వృషభములు
బలముగా గిట్ట విసిరి బేజారు పుట్టించు గోదలు
అచ్చుటెద్దులనదరించు నమిత శక్తి శాలులు
ముచ్చటగా పెంచిన మురిపించు పుంగవములు
ఒంగోలు గిత్తలు భారత కీర్తి ప్రదీప్తులు.
పొలములందు దుక్కి దున్ను పోటు వాహములు
కలిమినొసంగి మెతుకు పండించునీ వోఢలు
సైరికుల గృహముకు సంపద ప్రదాయినులు
నిరతము మేలు చేయునీ గడిపోతు బంటులు
ఒంగోలు గిత్తలు భారత కీర్తి ప్రదీప్తులు.
నాటిముచ్చట్లు నేడు చరితైపోయె
జాతిరత్నము నేడు దేశాన కనుమరుగాయె
నామమాత్రముగా మిగిలిన పశువాయె
దీనస్థితిలో కాబేళాలో కత్తులకు బలైపోయె
విలువగు జాతికాదరణలేదాయె నకట!
విదేశీ గడ్డపై నిలిచి యుండిన పశువులు
స్వదేశమందు తరిగిపోయిన సొమ్ములు
పాడిపంటలనిడిన గోమాత బిడ్డలు
వీడిన యాశలతో వదిలెను తమ నెలవులు
విలువగు జాతికాదరణ లేదాయె నకట!
వరదుడైనహరియె గోసేవలో తరించెను
పరమాత్మ మనకొక దారి చూపించెను
ధరలోన గోవులను పూజించమని పల్కెను
కరుణకల్గినమనసుతో కాపాడమనెను
గోసంరక్షణ మన కర్తవ్యమమని తెల్పెను.
మనజాతిపశువులను బ్రతికించరారండి!
ఘనమైన సంపదను తరలి పోనీకండి!
కూడుబెట్టు గోగణమును కాపుకాయండి!
నీడనిచ్చి గోకులమును పెంచిపోషించండి!
ఘనమైన దేవజాతిని రక్షించ రారండి !
----------------------------
