నీ నీడ
నీ నీడ
కానరావు కలను రావు..కలతకన్న తోడులేదు..!
తెలియని ఓ వెర్రియాశ..నీడకన్న తోడులేదు..!
జారదాయె కంటిచుక్క..ఇగరదాయె లోలోపల..
ఎదలోయల జరుగుతున్న..గొడవకన్న తోడులేదు..!
నది ఏదో సంద్రమేదొ..తీరమేదొ తోచదాయె..
ఛిద్రమైన ముద్దుపూల..పడవకన్న తోడులేదు..!
చిత్రమేదొ శిల్పమేదొ..ప్రాణదీప కోటిసాక్షి..
హృదినేలే అగ్గిపూల..తోటకన్న తోడులేదు..!
మానని నా గాయానికి..విందేమిటి కోకిలమా..
లేపనమది నీ తియ్యని..పాటకన్న తోడులేదు..!
ఈవెన్నెల మేడలోన..విహరించే భాగ్యమేది..
ఆవేదన తీర్చలేని..శ్వాసకన్న తోడులేదు..!

