నీ మేని సొగసులు
నీ మేని సొగసులు
నీమేని సొగసులకు కాపరిని చేసావు
దొంగిలించుట నేర్పి చోరుడిని చేసావు
కళ్ళతో గాలాలు వేయడం తెలియదే
అందాల కడలిలో జాలరిని చేసావు
నీవున్న కలలోకి ఓసారి చూసాను
నీ వీథికే పెద్ద దిమ్మరిని చేసావు
ప్రవరాఖ్యుడిని మించిపోవాలి అన్నారు
కన్నోళ్ళ దృష్టిలో తుంటరిని చేసావు
నీవడుగు పెట్టాక కోవెలైపోయింది
నా మానసానికే పూజరిని చేసావు
ఏచోట నిలిచినా ధ్యాస నీ మీదనే
ఎంతమందుండినా ఒంటరిని చేసావు
మన్మథుని భావాల తొలికావ్యమే నీవు
విద్య నేర్వని నన్ను చదువరిని చేసావు
సత్యభామకి నీకు పోలికలు ఉన్నాయి
అలిగినప్పుడు నన్ను కృష్ణుడిని చేసావు
సమిధవై వెలుగుతానన్నావు
సరసాల హోమానికే యజిని చేసావు

