నేటి జీవితం
నేటి జీవితం
పచ్చ నోట్ల కట్టలే నేడు ప్రామాణికం
విలువలన్నీ వీధి సరుకులై కూర్చున్నాయి
*అమ్మతనము* కాస్త రూపం మార్చుకునే
సరోగసిగా రూపాంతరం చెందుతుంది..
పుడమి చమటల్లో పుట్టిన ధాన్యం
అన్నమై అందరినీ బ్రతికిస్తుంటే
దగాపడ్డ రైతన్న దళారుల మోసంతో
*అమ్మకంతో* ఆకలి తీరని వేదనలో మిగిలింది..
పవిత్ర ప్రజాస్వామ్యంలో రాజకీయం
గద్దె ఎక్కే పెద్దల మాయాజాలంలో
ఓటుకు నోటు ఖరీదై కూర్చుంది
చేతి సిరా చుక్క *అమ్మకం* పెరుగుతూ పోతుంది..
పవిత్రమైన దాంపత్యం ఆదర్శ జీవనంలో
వరుడు రేటు కోట్లల్లో చేరుకొని
వరకట్నమే ఒక పిశాచిలా మారుతూ
వధువు *అమ్మకం* దిగులుగా తయారయ్యింది.
ఆన్లైన్ వ్యాపారం ప్రపంచమంత వ్యాపించి
చిన్న వస్తువుకు పెద్ద రేటు కడుతూ
చిరు వ్యాపారులను కష్టాల్లోకి నెట్టుతూ
*అమ్మకంలో* ఆదిపత్యం చెలాయిస్తుంది...
సాధారణ జీవితంలో సమాజ గౌరవం
లేని పెద్దరికాన్ని ధనంతో కొంటూ
ఖరీదైన వస్తువులతో ఇంటిని పెంచుతూ
*అమ్మకంతో* ఖరీదైన జీవనం సాగుతుంది..
అమ్మకం అంతా వ్యాపించి తిరుగుతూ
పేదోడికి కన్నీళ్లను మిగిలిస్తూ
పెద్దోడికి అప్పులను బహుమానంగా ఇస్తూ
*అమ్మకమే* నేడు ఒక నమ్మకంగా ఉంటుంది..
