STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేనొక

నేనొక

1 min
3



నేను ఒకన్నే, అయినా నేను అనేకాన్ని 
ఒంటరి వాన్నైనా, ఓరిమి వున్నవాన్ని
నాకు నేనే వన్ మాన్ ఆర్మీని, ఒక సైన్యాన్ని 
నాకు నేనుగా ఏకవచనంలోని బహువచనాన్ని

నేనొక వ్యక్తిని కాదు, ఒక సమూహం 
ఎన్నో మనసులు కలిసిన సమాహారం 
ఏక రూపంలో నున్న బహురూపాన్ని
బహుళ తత్వాల మధ్య పెరిగిన విశ్వాన్ని

పుట్టింది మొదలు, నాలో ఎన్నెన్నో పాత్రలు 
సరళం నుండి సంక్లిష్టాన్ని, సమ్మిళితాన్ని
దినదిన ప్రవర్ధమానమైన బహుముఖాన్ని
ఇంతింతై వటుడింతైనట్టుగా పెరిగినవాన్ని

నాలో ఉన్న అమ్మానాన్నల ఆనవాళ్లు 
నా పూర్వీకుల వంశానుగత సవాళ్లు 
భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసే మనసును
ఏకత్వంలో ఏకతాటిపైకి తెచ్చే మనస్తత్వాన్ని 

కుటుంబ బాధ్యతల్లో బహు బంధాలున్నోన్ని
తనయుడిగా, అన్నగా, తమ్ముడిగా
భర్తగా, అల్లుడిగా, తండ్రిగా, తాతగా 
ఏది ఏమైనా ఉమ్మడిగా దండిగా వరుసలు

బాల్యంలో స్నేహితులు, సన్నిహితులు 
యవ్వనంలో అనేక వ్యవహారాలు, వగైరాలు 
సమాజంలో పౌరునిగా బాధ్యతల బంధాలు 
వృత్తి, ప్రవృత్తిలో సహచరులు, సహోద్యోగులు

అనేక కష్టసుఖాలు, గెలుపోటములు నావే
నాలో సుఖదుఃఖాలు, కన్నీళ్లు, చిరునవ్వులు
నాకు ఆకలి పస్తులు, పంచభక్ష పరమాన్నాలు 
నేను అనుభవించనిదేది లేదంటే అబద్ధమే

నాలో ఒక స్వార్థి, ఒక త్యాగి ఉన్నాడు 
ఓసారి సర్వం కోల్పోయిన అభాగ్యుడున్నాడు
కసితో సంపాదించిన ఒక విజేతున్నాడు 
అన్నింటిని మించిన స్థితప్రజ్ఞుడున్నాడు !!



Rate this content
Log in

Similar telugu poem from Classics