నేల తల్లి
నేల తల్లి
కాలుష్యపు మేఘాలను..చూడలేను నేను..!
నేలతల్లి ఘోష చూస్తు..నిలువలేను నేను..!
చెట్లు పెంచు పనికన్నా..గొప్ప పనేంలేదు..
పుడమిమించి స్వర్గమేదొ..చూపలేను నేను..!
గోమాతను సేవించే..జనులుకదా జనులు..
ఆవుపాడి చేయుమేలు..తెలుపలేను నేను..!
ధనమేదో ధాన్యమేదొ..తెలుసుకున్న దెవరు..
పెట్టుగుణం దానముగా..ఇవ్వలేను నేను..!
మట్టికన్న బంగారం..ఉంటుందను కోను..
మంచికి నిధి నీమనసని..చెప్పలేను నేను..!
కోటిదీప రాశి ఉంది..అణువణువున చూడు..
నిన్నునీవు గమనించగ..నేర్పలేను నేను..
