నాగుల చవితి
నాగుల చవితి
నాగులచవితి నాగమ్మా
బ్రతుకు చీకట్లు తొలిగించేదే నీవమ్మా,
నాగపూజలతో నిను ఆరాధించేము
ఆదిశేషురూపును
హృదిలో పదిలం చేసుకునేము
కరుణను చూపే కల్పవల్లివై మము కాపాడవమ్మా.
పుట్టలో పూపొదలలో
దాగిన స్వామిని
పరవశ గానంతో స్వాగతిస్తాము,
కైలాసవాసుని కంఠాభరణమే
వరాలిచ్చు దేవుడిగా చెప్పుకుంటాము,
వైకుంఠవాసుని పాన్పే
కనులలో కదిలేటి దివ్యదీవనగా తలుచుకుంటాము,
వేదనలు తీర్చేటి గగనమే
మనసున విహరింపగా
నాగస్వరమే ప్రాణతేజంగా చేసుకొని మురిసెదము,
హరిహరుల ఊహలే తలపుల్లో దాచుకొని
సుఖశాంతుల సంపదలనే కోరెదము,
మా పూజకు సాఫల్యత చేకూర్చుతూ
మము గావుము నాగమ్మా.
నాగదోష నివారణతో
గుండెలయల పొదరింట్లో సంతోషాన్నే బందీచేసేము,
అనుబంధపు ఊహలకు ప్రాణమైన
సంతాన సాఫల్యతకై
ఆరాధనే చేస్తాము,
ఆవేదనపొంగే రోగబాధలను
నివారించవమ్మా
కనులలో కొలువై నిలిచిన దేవుడు విషసర్పం కాదంటూ
భయమును దాటించే చైతన్యస్వరూపుడిగా
హృదయమందు నిలవవమ్మా.
