కనకం రజితం పరుగులు
కనకం రజితం పరుగులు
కనకమా పరుగులు ఆపుమా
మౌనవీణా రాగంలా హృదిలో ఉండకుమా,
ఆకాశవీధివైపు
నీపయనం ఆపుమా.
తీరని కోరికల తలపుల్లో
నీవుండకుమా,
మా చూపుల పరవశం
నీవే కావాలి సుమా,
ప్రతీ వేడుకకు నీవే మెరుపై
మురిపించవా స్వర్ణమా,
మహా భోగపు ప్రతిరూపంగా
మహి నిను కొలుస్తుంటే
అందక ఆగక
పరిగెడితే ఏలమ్మ.
రజతానికి నేస్తమై
ఊహల హద్దులు దాటడం భావ్యమా,
కాలంకూడ చెప్పలేని పాఠంగా
విడ్డురపు లోకంలో విహరించకుమా,
ఈ మనసు నీధ్యాసన ఉండనీయుమా,
ఐశ్వర్య లోకాన్ని దర్శించలేని మాకు
నీవే ఐశ్వర్య లోకమై
భువిలోనే ఉండిపోమ్మ.
రజతమా సామాన్యుడి వెన్నులో
వణుకు పుట్టించకుమా,
మురిపించే కలగా వుండి
ఆడుకోకుమా,
మధ్యతరగతి తలపులలోని
వేడుకకు సంతోషం దూరంచేయకుమా,
అందరాని తీరాలు చేరలేని
సగటుమనిషి మౌనంచాటు వేదన
తీర్చుమా
