ఏంబ్రతుకో
ఏంబ్రతుకో
అరువునవ్వు పెదవులపై..మోయాలట ఏంబ్రతుకో..!?
మోసం వృత్తిగ చేసుకు..ఎదగాలట ఏంబ్రతుకో..!?
"అప్పుచేసి పప్పుకూడు"..సినిమా ఏం జీవితమో..
అప్పులన్ని ఎగ్గొట్టుట..నేర్వాలట ఏంబ్రతుకో..!?
పట్టపగలు కన్నులెదుట..అడ్డంగా దోపిడీలు..
అవినీతికి జైకొడుతూ..ఎగరాలట ఏంబ్రతుకో..!?
మంచేదో చెడు ఏదో..విప్పిచెప్పు పనేముంది..
వంచనకే ఓటేస్తూ..పెంచాలట ఏంబ్రతుకో..!?
అక్రమాల నరికట్టగ..నిలదీసే బలమేదోయ్..
చిత్తశుద్ధి చిరునామా..కాల్చాలట ఏంబ్రతుకో..!?
మనజండా కర్రకున్న..పొగరుమాట మరిచేరా..
కోట్లు కూడబెట్టుటలో..మునగాలట ఏంబ్రతుకో..!?
