నాగరికత
నాగరికత
కానలేని ముసుగులతో..బ్రతకడమే నాగరికత..!?
కల్మషాలు దాచేసుకు..నవ్వడమే నాగరికత..!?
కానిపనులు చేస్తుండుట..అదో గొప్పతనమేమో..
అసలు ప్రతిభ కనపడితే..అణచడమే నాగరికత..!?
కార్మిక కర్షక శ్రామిక..వర్గాలను కాతురెవరు..
స్వచ్ఛమైన దేవుళ్ళను..దోచడమే నాగరికత..!?
పెద్దబాలశిక్ష నాటి..చదువుగాక చదువేదో..
కార్పొరేటు విధానాన్ని..మెచ్చడమే నాగరికత..!?
ఓటెవరికి వేయాలో..తేల్చుకునే వీలెక్కడ..
అవినీతికి అధికారం..ఇవ్వడమే నాగరికత..!?
ఏమి శాంతి ఒప్పందాలో ఏమో అమలెప్పుడు..
దురాక్రమణచేయ సందు..చూడడమే నాగరికత..!
