నా సుకుమారి
నా సుకుమారి
మబ్బువిసిరిన పూల ఓణీ చుట్టుకున్నది నా సుకుమారి..!
చినుకుగంధం మనసు గడపకు అద్దుకున్నది నా సుకుమారి..!
పసుపుకొమ్ముకు తాడూమాదిరి నన్ను ఎప్పుడు కట్టివేసెనొ..
చెలిమిసూత్రం అణువుఅణువున నింపుకున్నది నా సుకుమారి..!
నుదుటి తిలకం చెమటచుక్కల కలయికేదో కథగ మారెను..
వలపుమువ్వల సవ్వడేదో పట్టుకున్నది నా సుకుమారి..!
కలల పంటకు అసలురూపం తోడు నిలుచుట వేడుకేగా..
విషయవాసన గుట్టు ఏదో అందుకున్నది నా సుకుమారి..!
నవ్వుపువ్వులు రువ్వుతూనే సాగిపోవును యేరులాగా..
అలుకలన్నీ వదిలివేయగ వేడుకున్నది నా సుకుమారి..!

