మరణమంటే
మరణమంటే
చచ్చిపోవడమే కాదు
మరణమంటే..!
ఆకలి కేకలో
ఆశల నడుమ అనాలోచిత నిర్ణయాలో
భూకంపాలో
సంసార సాగరాన చెలరేగిన పెను ప్రకంపనలో
కాదు మరణమంటే
నిజాలను పాతరేసిన చోట
నీతి రెండుగా చీలిన చోట
రాజకీయాలు రంగుమారుతున్న చోట
మోహపు వ్యామోహము ఉదయించిన చోట
వెలివేయబడిన మనిషి నిలుచున్న చోట
ఉద్భవించినదే మరణము
హత్యలూ కావు
ఆత్మహత్యలూ కావు
వయసుడిగాక దరి చేరిన శాశ్వత సెలవూ కాదు
కాదు కాదది మరణమంటే..
నమ్ముకున్న నమ్మకం తియ్యగా కోసినప్పుడు
కమ్ముకున్న చీకటిలో గాలమేసి లాగినప్పుడు
చిగురంత మొలిచిన ఆశను చిదిమేసినప్పుడు
అది నిజమైన మరణమే..
అనుభవాల పెనుగులాటలో
స్వార్థానికి పునాదులు తవ్వ్వుకుని
మోసపు ముసుగులు తొడుక్కుని
అసూయాద్వేషాలను ఒంటినిండా పూసుకుని
బంధుగణాల జాడలను తుడిచేసినప్పుడు
నీలోని మనిషి నీడలు తొలిగిపోయినప్పుడూ
నిజమైన మరణమే...
లెక్కతేలని నీచ నికృష్టపు చిగురులు
నీలో మొగ్గ తొడిగిన నాడు
తర తమ భేదాలను
తుంగలో తొక్కిననాడు
తనువుకంటిన మైలను తుడుస్తూ
మనసుకంటిన మలినాల్ని అలుముకున్ననాడు
నవ్వు బ్రతికినా చచ్చినట్టే కదా...
