మనసు పలికే రాగాల్లో
మనసు పలికే రాగాల్లో
మనిషి మనసును సుప్రభాతం మేల్కొల్పే
మౌనాన్ని పెగల్చి మాటల పురివిప్పుతూ
చీకటి మగతను చీల్చుకొని వచ్చింది
ఆకాశానికి కంటి చూపులు ప్రసరిస్తూ నిలిచింది..
ఉన్మత్తనాదం దూకుతుంది నయాగరా జలపాతంలా
కొండ నుంచి జాలు వారుతుంది మృదంగపు నాదంలా
మట్టి నాభిలో పురుడు పోసుకుంది అనంతం
నరాల్లో రక్తంలా ఉబికి వచ్చే అక్షరవు ఝరులు..
మస్తిష్కం అంచుల్లో మారుమోగుతుంది భావం
ఒడిదుడుకుల కొలనులో రాళ్లు పడుతుంటే
ప్రకృతిలోని ఘోష లన్ని రాగాల్లా వినిపిస్తుంటే
జీవిత పాఠం నేర్పుతున్నాయి నదీ ప్రవాహలు..
పసికూన లాంటి అక్షరం పిక్కటిల్లి అరుస్తుంది
భూమి నాద గర్భం చీల్చుకొని గువ్వలాగా
ఎక్కడో మబ్బుల్లో వాన చుక్క దాక్కొని
సంగీతానికి స్వరాలు సమకూర్చి పెడుతుంది..
రెక్కలు మొలిచిన పక్షులు ఎగురుతుంటే
ఆకాశం నిర్మలమై స్వాగతం పలుకుతుంది
కొమ్మ ఒడిలో రూపొందిన కుహురావం
నోటిలో పుక్కలించి పలుకుతుంది మధురంగా..
ఆకాశ రోదసిలో చీకట్ల నిషాధం కనిపిస్తే
ప్రకృతిలో వేణు గానం నడిచొచ్చి పలకరించే
మనసు ఇనుమును కరిగించింది వీణ తీగలే
తోలు తనువు ఉబికింది మధుర గాన స్పర్శ తోనే..

