మనసే మారి
మనసే మారి
అలరించే సుగంధాల..పూలగంప మనసేమరి..!
కాల్చదగిన జ్ఞాపకాల..చెత్తగంప మనసేమరి..!
వేదనతో జన్మలుగా..ఎడబాయని చుట్టరికం..
అనుబంధపు మిఠాయీల..పాతగంప మనసేమరి..!
బాధైనా సౌఖ్యమైన..నేస్తాలే ఎవరికైన..
ఈ సంగతి బోధపడని..ఇసకగంప మనసేమరి..!
భర్త ఎవరొ భార్య ఎవరొ..ఎంత వింత నాటకమిది..
పాత్రమరచి కుళ్ళుతున్న..పండ్లగంప మనసేమరి..!
పరుగుతీయు కోరికలకు..పగ్గాలతొ పనేంలేదు..
గమనించగ ఆగలేని..కలతగంప మనసేమరి..!
భయంతోటి వణుకిపోవు..విషయాలకు సెలవెపుడో..
ప్రశ్నించే చీకటింటి..మూగగంప మనసేమరి..!

