STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

మల్లెవేళ

మల్లెవేళ

2 mins
4


*మల్లె 'పువ్వే' కావచ్చు..

దానికీ…

విచ్చుకునే మనసుందని

ఎంతమందికి తెలుసు?


తెల్లని మల్లె చిరునవ్వులో

ప్రేమ తడి వుందని

హత్తుకుంటే మురిసిపోతుందని

ఎంతమందికి తెలుసు?


మల్లెను …

మగువతో పోలుస్తారు

మరి ఆ మల్లె మనసు

మగువలకైనా తెలుసా..?

నిజంగా తెలిసేవుంటే

కరుణశ్రీ చెప్పినట్లు

ఇంత " దయమాలి "

ప్రవర్తించే వారు కాదేమో..?


మెత్తని మల్లెలో అతి మెత్తని మనసుంటుంది.

ఈ విషయం తెలీని మూర్ఖులు దాని గుండె లో

సూదులు గుచ్చి గుచ్చీ బాధపెడతారు.హింసిస్తారు.

ఊలు దారాలతో గొఃతుకురిబిగిఃచి మురిసిపోతుంటారు

ఇంకొందరుంటారు..మోటు గాళ్ళు

దుర్మార్గంగా పడకపై వేసి కిరాతకంగా నలిపేస్తుంటారు.

సరసం తెలీని ' అరసికులు" వీళ్ళు

మల్లెపూవుకూ ఓ మనసుంటుందని , ..

దాన్ని బాధపెట్టకూడదని

ఎప్పుడు తెలుసుకుంటారో కదా వీళ్ళు.?


గజల్ తెలుగింటి కొచ్చాక .దాని రూపమే మారిపోయింది.

పదహారణాల తెలుగమ్మాయిగా మనలో కలిసిపోయింది.

గజల్ సాహితీ ప్రక్రియ ను ఎందరో కవులు హృదయానికి

హత్తుకున్నారు.అద్భుతంగా రాస్తున్నారు.


కానీ…


కోరుప్రోలు మాధవరావు గారు మాత్రం గజల్ ను

"జీవితం" చేసుకున్నారు.ఓ యజ్ఞంలా వేలాది గజళ్ళు

రాస్తున్నారు.(ఇప్పటికీ మూడున్నర వేలు దాటిపోయాయి)


ఎంతగా అంటే..?


చివరకు తన ఇంటి పేరే " గజల్ " గా మారిపోయింది.

ఇప్పుడు " గజల్ మాధవరావు " అంటే తప్పు ఆయన్ను

గుర్తించడం కష్టమై పోయింది.తేట తెలుగంలో ఆయన 

రాసిన గజళ్ళు రెండు సంపుటాలు గా వచ్చాయి.

పాఠకుల మన్ననలూ పొందాయి.ఇప్పుడు మూడో 

సంపుటి రాబోతోంది.


మల్లెల గురించి ఆయన రాసిన గజల్ గురించి ఇప్పుడు

ముచ్చటించుకునే ముందు…..


ఓ సారి ఆ గజల్ చదవండి.!


*గుండెతడిని మోయలేక..మూల్గుతోంది మల్లెమనసు..!

తొలిరాతిరి వేడుకటా..నవ్వుతోంది మల్లెమనసు..!


ఏది తప్పు ఏది ఒప్పు..సమాధాన మిత్తురెవరు.. 

ప్రేమ అంటే ఏమిటని..అడుగుతోంది మల్లెమనసు..! 


గుడికి కాని జడకు కాని..ఏ తేడా తలపోయదె.. 

అసలుచెలిమికి గీతమై..మిగులుతోంది మల్లెమనసు..! 


సుడిగాలికి బెదిరిపోదు..తుఫానులకు భీతిల్లదు.. 

దండలోని దారమంటి..నలుగుతోంది మల్లెమనసు..! 


ఖేదమైన మోదమైన..పెదవిచాటు నిలుపవలెగా.. 

రెప్పలంటని కనులతో..మరుగుతోంది మల్లెమనసు..! 


మాట వినే నాధుడెవరు..చిన్నిలేత మొగ్గ ఘోష.. 

జాలిలేని జగతి నడుమ..వాడుతోంది మల్లెమనసు..! 


జాణతనము సహనమంటు..వీణ తానౌ మాధవా.. 

మౌనగగన వీధులంటి..తిరుగుతోంది మల్లెమనసు..!"!!


మల్లెలంటే …


*అరసికులకు ఎంత కసో..

*మన‌ కవులకు అంత కరుణ


నవ్వుతూ,తుళ్ళుతూ విచ్చి ,మనసారా నవ్వాల్సిన

మల్లె మొగ్గలను…

.

విచ్చీ విచ్చక ముందే …..

సూదులతోగుచ్చి, దారాలతో ఉరితీసి, చేతులతో 

నలిపేసే ఈ దుశ్శాసన లోకంలో " పూల ఘోష "ను

వినేదెవ్వరు? 


'పుష్ప విలాపాన్ని ' పట్టించుకునే నాధుడెవరు?


నిలువెల్లా నలిపి,నిర్దయగా చీపురుతో చిమ్మినా…..

పరిమళం వెదజల్లే మల్లె మనసును అర్థం చేసుకునే

అధినాధులెవరు..,?


గుండె తడిని మోయ లేక ఓ వైపు మల్లె మనసు

 మూల్గుతుంటే…..తొలి రాతిరి వేడుకుంటూ పడగ్గదిలో

 పందిరి మంచాన్ని మల్లెల తోరణాలతో అలంకరించారు.

 పడకపై మల్లె మొగ్గలను దుప్పటిలా పరిచారు.ఈ …

 జాతరంతా చూసి మల్లెలు నవ్వుకున్నాయట.


 *తొలి రాతిరి వేడుకలో మల్లెలను ఇలా అలంకరించి,

 ఆనందం పొందడం అవసరమా? ఏది తప్పు?యేది

 ఒప్పు? ఓ మహాత్మా ! సమాధానం ఎవరు చెబుతారు?

 అసలు ప్రేమ అంటే ఏమిటని అడుగుతోందట మల్లె

 మనసు.


 *మనుషుల్ని చూస్తుంటే జాలేస్తుంది.

 గుడికి...జడకు మధ్య గల తేడాను గురించిఈ మూర్ఖ

 లోకం ఎప్పుడైనా ఆలోచించిందా?

 నిజానికి స్నేహగీతమై నిలుస్తోంది మల్లె మనసు.


 *మల్లె అంత సుకుమారియైనా……,

 సుడిగాలొచ్చినాబెదిరిపోదు…

 తుపానుకూ భీతిల్లదు.

 కానీ…

 దండలోని దారమంటేనే నలిగిపోతుంది మల్లె మనసు.


*సంతోషమైనా..దుఃఖమైనా పెదవి చాటున వుంటేనే

 అందం..ఆనందం.కానీ ఇలా‌ బరితెగించి మరీ …

 బలాత్కరించే ఈ మనుషుల ధోరణినేమనాలి ?

 రెప్పలంటని (నిద్ర లేని రాత్రులు) కనులతో మరిగి

 పోతోంది మల్లె మనసు.


*తమ మాట వినే నాధుడెవరని..

 ఓ చిన్ని లేత మల్లె మొగ్గ ఘోషిస్తోంది.

 జాలి లేని లోకంలో దీనంగా వాడిపోతోంది , 

 మల్లె మనసు నలిగిపోతోంది.


*అన్నీ తెలిసిన జాణతనం మల్లెలది.

 అందుకే అవి సహనం వహిస్తున్నాయి.

 రాగమైనా,సరాగమైనా..హింసైనా

 ధ్వంసమైనా వీణలా భరిస్తూ…

 మధురమైన మౌన గీతిని ఆలపిస్తూ…

 గగన వీథులంట తిరుగుతోంది...మల్లెమనసు..!!



Rate this content
Log in

Similar telugu poem from Romance