మజిలీ
మజిలీ
మజిలీ
ఇంత దూరం వచ్చేక తెలిసింది
ఈ దారి ఎటువంటిదో
ఎన్ని ద్రుశ్యా ద్రుశ్యాలను చూపిందో
ఎన్ని గుండెల్ని తాకిందో
ఎన్ని మలుపులు తిరిగిందో
బహు కాలపు బాటసారిని
వెనక్కి పోవడం అసంభవం
ఇద్దరం అలసిపోయాం
కాస్సేపు కూర్చుందాం
ఎక్కడా ఓ చెట్టు కనిపించదు
పిట్ట జాడా లేదు
ఒక పిల్లీ ఎదురౌదు
రోడ్డంతా అపరిచితులు
మాట కలపని ప్రయాణికులు
మౌన భంగం కోరితే
ఆశా భంగం తప్పదు
కాస్సేపు ఈ ఎడారినే పలకరించుదాం
ఈ ముళ్ల జెముడినే రెండు ప్రశ్నలడుగుదాం
ఆకాశం వైపు తల ఎత్తి అకాల వర్షాన్ని
రా రమ్మని పిలుద్దాం
నిత్యం మిత్రుల్లా పలకరించే
సూర్యుడిని చంద్రుడిని
సహాయం అడుగుదాం
గాలితో ఊసులాడుదాం
రోడ్డుతో దొంగాట ఆడుదాం
ఇసుక రేణువుల్ని చేతుల్లోకి తీసుకొని
చిన్న పిల్లల్లా గాలిలో ఎగరేద్దాం
పరిగెత్తుదాం
పరుగు పందెం వేసుకుందాం
ఈ మజిలీ దాటితే కొత్త మనిషి
కనిపించడా...
