మౌనం...
మౌనం...
మాటకు మాటరానపుడు
మౌనం
పలుకులో భావం బహిర్గతం కాలేనపుడు
మౌనం
కనులు మాట్లాడ గలిగితే
మౌనం
వేదనాతిశయం
మౌనం
ఆగ్రహం శిఖరాగ్రమెక్కితే
మౌనం
గుండెలో శరాలు గుచ్చుకుంటే
మౌనం
ప్రేమ మోసగించితే
మౌనం
అలివేణికి అలకాస్త్రం
మౌనం
రత్యానంతర శాంతి
మౌనం
మౌనంలో గుప్తమైన
మహా స్థితి శక్తి...
గతిశక్తిగా మారితే
కాల గతినే మార్చగలదు
కొండలను పిండి చేయగలదు
గుండెలను చీల్చి
పెకళించగలదు
ఆకాశాన్ని చీల్చ గలదు
అంబుదిలో సునామీ సృష్టించ గలదు
అణు విస్ఫోటనంలో
తనే అంతమై పోగలదు
మౌనం మంచిదే !
కానీ అన్ని వేళలా కాదు
సంఘం వక్రమార్గంలో పయనించినపుడు
స్వేచ్ఛ విశృంఖలతను పూసుకున్నపుడు
నవీనత వేయి వెర్రితలలు వేసినపుడు
పాలకులు నిరంకుశం వైపు పరుగులిడుతు న్నప్పుడు
ఏలికలు సగటుజీవిని
వేపుక తింటున్నపుడు
నీ హక్కులను ఆస్తులనూ
అన్యాక్రాంతం చేస్తున్నపుడు
కుల మతాలతో చిచ్చు గొట్టి
మీలో చిచ్చు రగిలించినపుడు
మౌనం వహించడం మహాపాపం!
పెదవులకు పని చెప్పి
మాటలను తూటాలుగా మార్చి
ఎలుగెత్తి
తలనెత్తి
ప్రశ్నించు
ప్రశ్నించు ప్రశ్నించు
రాజులు దిగివచ్చేదాకా
పాలకులు నీ పాదాలు పట్టేదాకా
ఆ పిదప మౌనం వహించు
క్షమాగుణంతో....
