కుటుంబం
కుటుంబం
******************
సంసారం ఓ సాగరం
ఊపిరున్నంత వరకు
ఈదుతూనే వుండాలి
అలలు నిత్యం తీరంతో
ముద్దాడుతున్నట్టు
అలకల కులుకులు
సరసాల జగడాలు
వలపుల కోపాలు
తాపాలు తాలింపులు
కలహాల విరహాలు
చెణుకుల విరుపులు
ఆలుమగల అన్యోన్యానికి
అనురాగపు గురుతులు
సంతోషపు చివురులు
ఆనందపు మొలకలు
మేఘాలు అడ్డుపడినంతనే
సూర్యుని వెలుగు ఆగదు కదా
కష్టాల కడగళ్ళు వచ్చినంతనే
జీవన పయనం ఆగిపోదు
రంగులు వెలిసి నంత మాత్రాన
ఇంద్రధనుస్సు విరియక మానదు
నమ్మకమనే నావపై
జీవన ప్రయాణం సాగితే
అన్యోన్యతా విరులు విచ్చుకుని
కుటుంబం నిండా
సంతోషపు సుగంధాలు పూయవా
