STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కృష్ణ మహిమ

కృష్ణ మహిమ

1 min
210

కందములు.


1.జననీ జనకుల బ్రోచిన

వనమాలీ!నిన్ను కన్న వారే పూజ్యుల్

ఘనమగు కార్యములు సలుప 

చనుదెంచితి వీవు భువిని సాకారముగన్.


2. జీవుల కర్మలు ద్రుంచుచు

కావఁగవచ్చితె ముకుంద కరుణాత్ముడవై!

శ్రావణ బహుళాష్టమిలో

ఠీవిగ నరుదెంచి తీవు ఢింబకు వోలెన్.


3. ఫణిరాజు ఛత్రముగ నా

ఘనమగు యమునమ్మ నిల్చె కడుగగ పదముల్

కనులందు కరుణ కల్గిన

నినుతల్చగ కాలు నఘము నీరజ నయనా!


4. వెన్నను భుజించి ప్రీతిగ

మన్నును మ్రింగెడి గుణమహ!మాయలు తగునా!

అన్నీ సమమని తెలుపుచు 

పున్నెము లిచ్చు నిను దల్చి మ్రొక్కితి కృష్ణా!.


5. పుట్టినదాదిగ కర్మల

పట్టిచరించెదము కృష్ణ!పంకపు జన్మల్

నెట్టగ నీదయ కోరుచు

పట్టితి నీ పాదయుగము భక్తిగ శౌరీ!.


6. గోకులవందిత కృష్ణా!

నీకనుసన్నల నడిచెద నిర్మల హృదితో

నాకలతలు తీర్పవ హరి!

శ్రీకరమగు నీదుతలపు శ్రేయము నొసగున్.


 


Rate this content
Log in

Similar telugu poem from Classics