కొత్త జన్మ...
కొత్త జన్మ...
ప్రతి మరణం కొత్తజన్మ..ఇస్తూనే ఉంటుందోయ్..!
ప్రతిక్షణం ఓ పాఠం..చెబుతూనే ఉంటుందోయ్..!
నేను-నాది అన్నవారు..ఎవ్వరేమి పట్టుకెళిరి..
మూర్ఖత్వం పేట్రేగుతు..పోతూనే ఉంటుందోయ్..!
ఇష్టాలకు శిరసొంచిన..కష్టాలకు తెఱలేచును..
జీవనసత్యం అద్దం..పడుతూనే ఉంటుందోయ్..!
ఏది-కలిమి ఏది-లేమి..చెలిమిమించి ధనమేదట..
మదినిపట్టి బుద్ధి శిలువ..వేస్తూనే ఉంటుందోయ్..!
తడిసిన ధాన్యం ప్రభుతకు..కొనగా భారం సరెలే..
అన్నదాత ప్రాణాలను..తీస్తూనే ఉంటుందోయ్..!
ఎదురుచూపు కోవెలలో..మనసేగా ప్రేయసియై..
వాసంతం మరలమరల..వస్తూనే ఉంటుందోయ్..!
మాధవుడెవరో ఎక్కడ..వెతుకులాట ఎందుకటా..
శుద్ధ చైతన్యం విందు..చేస్తూనే ఉంటుందోయ్..!
