కోకిలమ్మ
కోకిలమ్మ
ఇంటిపెరటి కోకిలమ్మ..పిలుస్తూనె ఉన్నదిలే..!
పుట్టినూరువైపు మనసు..లాగుతూనె ఉన్నదిలే.!
ఈ ఉగాదితో బంధం..ఆరురుచుల అనుబంధం..
అమ్మప్రేమ గంధాలను..పంచుతూనె ఉన్నదిలే..!
వేలుపట్టి నడిపించెనొ..గుండెలపై ఆడించెనొ..
నాన్నమాట వెలుగుదారి..చూపుతూనె ఉన్నదిలే..!
పదోక్లాసు చేరుదాక..చదువుకున్న తీరేదో..
ఆటవిడుపు అడుగడుగున..నేర్పుతూనె ఉన్నదిలే..!
రాములోరి గుడిపొంగలి..రుచినిపలుకు పదములేవి..
అంతరంగ మౌనములో..నిలుపుతూనె ఉన్నదిలే..!
బ్రతుకుతెరువు పరుగులోన..మరువలేని నా బాల్యం..
జ్ఞాపకాల పెట్టెలోన..నవ్వుతూనె ఉన్నదిలే..!

