ఖాళీ కడుపు రాసే శోక గీతం
ఖాళీ కడుపు రాసే శోక గీతం
ఏరోజు సూర్యుడు ఉదయించని గడప లేదు
ప్రపంచానికి వెలుగు పంచని రోజు లేదు
కానీ ప్రతి ఇంట్లో పొయ్యి వెలిగే హామీ లేదు
బతుకుల్లో వెలుగు నిండే దాఖలాలు లేవు
ఒకరి పళ్లెంలో పంచభక్ష పరమాన్నాలు
మరోకరి చేతిలో మెతుకుల్లేని పాత్రలు
అన్నీ ఉన్నవారికి తిన్నా అరుగని కడుపులు
కడు పస్తులున్న వారికి దొరకని మెతుకులు
తినగా మిగిలిన అన్నం చెత్తకుప్పల పాలు
భుక్తాయాసంతో నిండిపోయే ఆసుపత్రులు
ఇక్కడ ఒక మెతుకుకోసం వేటాడే తిప్పలు
కన్నీళ్లు కళ్లను తడిపినా తీరని తప్పిదాలు
ఏ కవి రాయని ఖాళీ కడుపు రాసే శోక గీతం
ఏ గాయకుడు పాడలేని చిక్కటి విషాద గేయం
ఏ వైద్యుడు పూడ్చలేని హృదయపు గాయం
ఏ నాయకుడు తీర్చలేని ఈ సామాజిక దైన్యం
ఎవరూ ఆలపించని ఆక్రందనల రాగం
ఆకలితో ముడుచుకున్న పేగులు పాడే శోకం
ఆకలి, అర్ధాకలితో నిద్రపోయిన మనసులు
జీవశ్చవపు దేహానికే తెలిసే మరణ ఘోషలు
ఆకలంటే అన్నం కోసం కాదు వెంపర్లాట
అది ఆత్మగౌరవం కోసం పోరాడే తండ్లాట
ఒక ముద్ద అన్నం పంచితే కాదు కదా దానం
ఒక మనిషి ఉనికిని నిలబెట్టితే పరోపకారం
సమాజం పురోగతి ఆకాశహర్మ్యాల్లో లేదు
ఆకలితో ఉన్న చేతికి అన్నం అందిస్తే చాలు
మానవత్వం మరిచి నిలిపే ఉత్సవ విగ్రహాలు
అన్నం ముద్ద పంచితే ఎన్నో చిరునవ్వులు
చరిత్రలో ఎన్నో యుగాల శిలాశాసనాలు
నాగరికతను తెలిపేది ఆకలి లేని శ్వాసలు
ఎన్ని ఆకలికడుపులు తృప్తి చెందితే ఓ లెక్క
నాలుగు ముద్దలు నోట్లోకి జారితే అది పక్కా
ప్రతి గింజ పదిమందికి దక్కితే ఓ గౌరవం
ప్రతి ఆకలి మనదిగా భావిస్తే సంస్కారం
ప్రతి మనిషి కడుపు నిండినపుడే చలువ
లేదంటే నాగరికత లేని సమాజంగా విలువ !!
