నీకు బతుకు భారమనిపిస్తందా మిత్రమా
అయితే కాసేపు నీ గుండె తలుపు తెరువు
నీ మనసుతో ఒక్కసారి మాట్లాడి చూడు
ఎవరో కాదు, నీ ప్రశ్నకు నీ లోనే జవాబు
ఆ మోసే భారం నీ జీవితానిది కానే కాదు
నీ మనసులో మోసే అనవసర భయాలు
చెప్పుకోలేని బాధలు, వదులుకోలేని జ్ఞాపకాలు
వెన్నంటి వేటాడే విషాదపు వ్యథల కథలు
ఒక అపజయమే జీవితానికి తుది తీర్పు కాదు
తగ్గిన మార్కులు నీ విలువను కొలవలేవు
ఉద్యోగం ఆలస్యమైతే కాలమే లేదనుకోకు
శ్వాస ఉన్నంతవరకు అవకాశాలు నీ తోడే
ఇతరుల విజయాలతో గుండెను కొలవకు
మిథ్యా మాధ్యమాల్లో కనిపించే నవ్వులు
నిజమైన ఆనందాలు కావు, శాశ్వతం కావు
చిరునవ్వుల వెనుక ఎన్నెన్నో కన్నీటి చరిత్రలు
బతుకు బాధ్యతల బండిని ఒక్కడివే లాగకు
అన్నింటినీ మోసే భుజాలకు ఓ అలసే రోజు
నాకు సహాయం కావాలనడం బలహీనత కాదు
సహకారం కోరేది మనిషితనానికి మరో పేరు
మలిదశ వృద్ధాప్యపు ఛాయలూ భారమా
అసలు తాను భారమైతే కాదు, ఓ ఇంటి చరిత్ర
ముడతల్లో కాస్త కాలం రాసిన గ్రంథాలయం
నీ నడక నెమ్మదైనా, రేపటి తరాలకు దిక్సూచి
ఒకప్పుడు అందరినీ నడిపించిన ఆ చేయి
ఈ రోజు ఆధారమై నడవాల్సి వస్తే హాయి
అది ఓటమి కాదు, భారం కాని ఒకానొక దశ
జీవిత వలయం పూర్తవుతున్న సహజ దిశ
బతుకు భారమనిపించే క్షణంలో గుర్తుపెట్టుకో
మహా వృక్షం తన నీడను తన కోసం కాదు
తన తల తనకు భారమైనా పరుల కోసమే
అయినా తన ఉనికిని ఎప్పుడూ ప్రశ్నించదు
ఏ నది తన నీటిని తానే తాగదు, దాయదు
దీపం తన వెలుగును తానే చూడదు, వాడదు
పువ్వు తన పరిమళాన్ని తానే ఆస్వాదించదు
నీ జీవిత విలువ కూడా నీకు కనిపించదు
కానీ ఎవరో ఒకరి బతుకులోనువ్వే ఒక ఆశ
నీ బతుకు భారమనిపించడం నీలోని నిరాశ
నిన్ను నువ్వు శిక్షించుకోకు, త్యజించుకోకు
నీతో నీవే మనసులో ఓ ఆలింగనం చేసుకో
ఒక మనిషితో మాట్లాడి చూడు, తెలుస్తుంది
ఒక చెట్టును చూసి నిలబడు, నేర్పుతుంది
ఒక పుస్తకాన్ని తెరువు, ఈ ప్రపంచాన్ని చదువు
ఒక చిన్నపిల్ల నవ్వు చూడు, ఓ ప్రశాంతత
ఒక వయో వృద్ధుడి చేతిని పట్టి నడిపించు
ఒక ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెట్టు
ఇతరుల జీవితంలో వెలుగు వెలిగించి చూడు
క్షణంలోనీ చీకటి కూడా కరిగి, పారిపోతుంది
జీవితం భారంగా మారేది నీ నిస్పృహతోనే
మనిషి ఒంటరివాడు కావచ్చు, కాకపోవచ్చు
కానీ అనవసరమైనవాడు ఎప్పుడూ కాదు
తన ఉనికి ఈ విశ్వ గీతంలో అపూర్వ స్వరం
బతుకు భారమనిపించిన ప్రతిసారీ తలచుకో
నాకు ఎన్నడూ ఈ బతుకు భారం కానే కాదు
నాకు పూర్తిగా వికసించాల్సిన ఒక జీవితం
భారమని భావించిన రోజు ఈ ప్రాణం శూన్యం!