గుండెలయల
గుండెలయల
వేణువుగా మనసుపట్టి..మలచినదే తెలియలేదు..!
గుండెలయల మాటు తాను..దాగినదే తెలియలేదు..!
హృదయమెలా ఉంటుందో..అశ్రువుకే ఎఱుక కదా..
రాగసిరుల మధువుసరిగ..నింపినదే తెలియలేదు..!
సంప్రదాయ సిరులరాశి..తన చూపే గమనిస్తే..
నా కనులకు మాటాడుట..నేర్పినదే తెలియలేదు..!
తలపులెల్ల సంచరించు ..లోకాలే అద్భుతమే..
యుగయుగాల చెలిమివీణ..మీటినదే తెలియలేదు..!
కత్తులేవొ విసురుతున్న..మాదిరిగా చూపులేల..
తన వలపుల కడలిలోకి..తోసినదే తెలియలేదు..!
మెఱుపువాన కురుస్తుంటె..మైమరపుల వాగైతిని..
భావనయే సమాధిగా..మారినదే తెలియలేదు..!

