ఎత్తుకి పై ఎత్తు
ఎత్తుకి పై ఎత్తు
ఎత్తుకు పై ఎత్తులతో..ఆటలాడు పనేమిటో..!?
ఎత్తిపొడుపు మాటలతో..మేలమాడు పనేమిటో..!?
సంతలోని సరుకులాగ..చూడటమా మనుషులను..
తెలివంతా కాలబెట్టి..బేరమాడు పనేమిటో..!?
శతాబ్దాలు గడచిపోయె..ఆడపిల్ల రాతేమిటి..
మాతృత్వం మంటగలిపి..అత్తలాడు పనేమిటో..!?
ఆరోగ్యం మాటమరచి..ఆరగింతురాహారం..
జన్మలెన్నొ ఎత్తేస్తూ..తన్నులాడు పనేమిటో..!?
సత్యమేదొ తెలిసికూడ..లేదు బుద్ధి వికాసమే..
ఇష్టాలకు బానిసలై..ఊగులాడు పనేమిటో..!?
