దక్షిణగంగ గోదావరి
దక్షిణగంగ గోదావరి
దక్షిణగంగ గోదావరి లేనిదే ఆంధ్రులకు లేదు వరి,
ఈ తరుణి తరంగిణి మన అందరికీ జీవన ప్రహరి,
పరవశించే పరవళ్లు వినిపించెను ఆనంద లహరి,
తన దరిలో ప్రతి పుణ్యక్షేత్రం ఒక సౌభాగ్య మంజరి ।౧।
గట్టంటే గుర్తుకు వచ్చేది గలగల పారే గౌతమి గోదావరి,
కోండా కోన లోయల్లోంచి సృజించెను తన ప్రవాహ దారి,
కాటన్ దొరగారు సేచనం యంత్రవిద్యలో నిపుణ నేర్పరి,
ధవళేశ్వరం ఆనకట్టు తో ఇచ్చారు మనకి జలకళ జలసిరి ।౨।
వ్యాసపురి నుండి పరుగులు తీస్తూ చేరింది భద్రగిరి,
భక్తులు వచ్చారు శ్రీ సీతారాముల ఆశీర్వచనం కోరి,
పుష్కర స్నానములకు వెళదాం రాజమహేంద్రపురి,
తెలుగుగంగకు ఇద్దాం అంబరాన అరుదైన అంబారి |౩|
రైతు బ్రతుకు కు ఆమె అయ్యెను ప్రాకృతిక కాపరి,
ఆవిడ లేనిచో ఆశలు ఆశయాలు అయ్యెను ఆవిరి,
పసిడి సారం పాడి పంటలు ఇచ్చెను గలగలా పారి,
గోదారమ్మ ఉనికి ఉల్లాసంతో మ్రోగిచగలం జయభేరి ।౪।