చూపుల సంతకం..✍️
చూపుల సంతకం..✍️
ఒక్కసారి ఇటు చూడవా...
మరీ అంత బెట్టు దేనికమ్మా...
నా చూపులతో నిన్ను బంధించేయనులే..!
ఏదో నీ చూపులలో భావాలను ఒడిసిపట్టి
నీ మీద ఒక కవనం తయారు చేసి
నీకు బహుమతిగా ఇద్దామని - అంతే..ఒట్టు..!
నీకో నిజం చెప్పనా...
నువ్వు నన్ను సూటిగా చూడక పోయినా
నీ చూపు నా మనసును ఎప్పుడూ
తాకుతూనే ఉంటుంది...
అణువణువూ స్పృశిస్తూనే
ఉంటుంది. నిజం...ఒట్టు...!
నీకు ఇంకో నిజం చెప్పనా...
నువ్వు నన్ను చూడకూడదు అనుకుంటూనే
చూసే దొంగ చూపులను నేను కనిపెట్టేనులే..
అవును...నిజం...ఒట్టు...!
అలా కాదు..అంటావా...
అయితే ఇటు తిరుగు మరి.
ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా
చూసి నాలో భద్ర పరుచుకున్న
నీ రూపాన్ని చూడు
ఎంత అపురూపంగా దాచుకున్నానో..!
నీ రూపం చుట్టూ కట్టిన బీటలు
వారని నా ప్రేమ కోటను చూడు
ఎంత పదిలంగా , భద్రంగా ఉంచానో..!
నీ ప్రేమ కోసం ఆరాట పడే
నా హృదయ వేదన చూడు...!
నీ పిలుపు నా మది చేరగానే
వర్షించేందుకు సిద్ధంగా ఉన్న
నా కనుపాపను చూడు...!
అవును...నిజం..ఒట్టు..!!
ఎటో మొదలు పెట్టి..
ఎటో వెళ్లిన కవితలోని
భావాన్ని ఒడిసిపట్టు
నా హృదయం మీద
నీ చూపుల సంతకం చేసి పెట్టు..!!
© Radha

