చిగురు కొమ్మల చేవ
చిగురు కొమ్మల చేవ
అరుగు మీద కూర్చున్న ముచ్చట్లు
కడిగేసుకుంటున్న మనసులోని బాధలు
లోకాభిరామాయణం, ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ
ఆకులు రాలుతున్నాయి, తలపై ఒకటొచ్చి పడింది
చూపులు చెట్టును చుట్టుముట్టాయి
ఇన్నాళ్లు ఎంటికలున్న కొప్పులా కనిపించేది
కాలానికి శిశిర జ్వరం సోకింది, ఏటా ఇదో ప్రక్రియ
ఆకులు కోల్పోయిన రావి చెట్టు కన్నీరు కార్చలే
తెరిచింది జ్ఞాపకాల పెట్టె
కాలం కొంత అరిగిపోగానే
చిగురాకుల కొమ్మల్ని సింగారించుకుంది
పచ్చనాకులు, పండుటాకులకు తామే మూలం
చిగురుటాకుల చేవ రంగు, మృదుత్వం ప్రత్యేకం
ఈదురు గాలులకు ఊయలలూగిన కొమ్మలు
చంటి పాపల్లా తల్లి చెట్టుకు ముద్దులు పెట్టాయి
నూతనోత్తేజం, ఉద్వేగం, ఉత్సాహం అన్నీ
అరుగు మీద ఒంటరిగా కూర్చున్నా
చెట్టు జీవిత చక్రం నాకో పెద్దబాలశిక్ష
ఏ రంగంలో అయితేనేం
చిగురుటాకుల బాల్యాల్లో దాగున్న ప్రతిభకు
సాధన చేయించి మేధస్సుకు సాన పెడితే
అవసాన దశ దాకా అద్భుతాల పరుగులు
కోకిల గానాలు, నెమల్ల నృత్యాలు
లేడి పరుగులు, ఆటలు అన్నింటిలో తేజస్సులు
పల్లె నుంచి దేశం దాకా వచ్చే గుర్తింపులు
చిగురుటాకుల దశలోనే చేవను చించేస్తే
తల్లిదండ్రుల వేర్లు నిద్రపోకుండా చింతిస్తాయి
చిగురుటాకుల కొమ్మల తోడు లేని గాలి
చినుకులు, సూర్యరశ్మి చిన్నబోతాయి
ప్రకృతికి ఆందోళన, ఆగ్రహం
