చెలిమి మీర
చెలిమి మీర
గోర్వెచ్చని ప్రేమ కదా..చెలిమిమీర బ్రతికించును..!
చిత్తశుద్ధి బుద్ధి కదా..పాఠాలను నేర్పించును..!
ఆకాశం కన్న అసలు..నేస్తమెవరు ఎవరికైన..
సకల భోగముల నొసగే..సంపదలను వర్షించును..!
నాట్యమాడు చెలియకసలు..నటన చేత కాదుకదా..
కన్నులతో పూలభాష..మౌనముగా వడ్డించును..!
చిరుగాలిని ప్రేమించని..ప్రాణమసలు ఉంటుందా..
చైతన్యము పొంగించును..నిలువెల్లా అలరించును..!
కాలమనే పాత్రలోన..స్నేహమేగ అసలు మధువు..
పంచుకునే భాగ్యమేగ..దైవత్వము వెలిగించును..!
జన్మనిడిన అమ్మగాక..దైవమెవరొ మనకెందుకు..
తనబిడ్డలె లోకముగా..జీవించును మరణించును..!
నాన్నంటే మహర్షియే..నాన్నంటే మౌనయోగి..
తన కుటుంబ క్షేమముకై..అనుక్షణం తపియించును..!
గురువంటే నీ శ్వాసయె..అత్యద్భుత జ్ఞాననిధియె..!
చైతన్యపు మూలమేదొ..అందించును లాలించును..!

