భరోసా
భరోసా
భరోసా....
(ద్విరదగతి రగడ )
చెలిమి బీజము మొలిచి చిగురించు బాల్యమున
కలిమి తలపుకు రాని కలిసియున్న క్షణాన
సరదాగ గడుపుచూ చదువుకొని తిరిగాము
చిరునవ్వుతో గడుపు చిరకాల మిత్రులము
బరువు బాధ్యతలనెడి పడవలో పయనించి
కరము కలిపిన మనము కాలమున విహరించి
వత్సరమ్ములు నడిచి వయసును జయించాము
మత్సరమ్మును వీడి మమతలను పెంచాము
ఏమైంది మిత్రమా!ఎందుకో?యీ దిగులు?
ప్రేమగా నడిగితిని బెంగనిప్పుడు వదులు!
మనమధ్య దాపరిక మర్మములు లేవులే!
చనువునే చూపితిని సాధింపు కాదులే!
నీకు తోడుగ వచ్చు నేస్తంబునే కదా!
నీ కష్ట సుఖంబుల నిల్చి యుందును సదా!
కోటి కోర్కెల నిపుడు కూర్మితో తీర్చెదను
మాట తప్పను చెలీ!మంచిదానను నేను!
మరలిన కాలంబున మన స్నేహ బంధమ్ము
పరిమళమ్ములు జిమ్ము వసివాడని సుమమ్ము. //
