భారత సంస్కృతి
భారత సంస్కృతి
భరత సంస్కృతి.
(తేటగీతి మాలిక )
వేదకాలపు సంస్కృతిన్ వీడి జనులు
పరుల నాగరికతఁ బట్టి వరలుచుండ
చెఱుపు జరుగునీ జాతికి చింతమిగులు!
మూఢమతులైన బిడ్డలు ముప్పు కనక
మోసపోవుచు మసటులో మున్గుచుంద్రు!
వెఱ్ఱి పోకడల్ పోవుచు వీడి సిగ్గు
చిర్రుబుర్రు లాడుచు నుండి చిందులేసి
మరచినారీ జగంబును మందమతులు.
వారి నిప్పుడు పెద్దలు బాగుచేసి
జవము నిడుచుండి యోర్పుతో సాకవలయు!
పూర్వ మెప్పుడో కృష్ణుండు బోధచేయు
ధర్మముల్ నేటి తరములు తల్చవలయు
వరదు డొసగిన 'గీతను పఠన చేయు
వారి కెల్లెడ విజయంబు పలుకరించు!
భరత సంస్కృతీ విభవమున్ భావితరము
నిలిపి యుంచెడి విద్యను నేర్పవలయు!
సాధు సజ్జనాత్ములు నేడు జాతి నెల్ల
జాగృతపరచి బోధించ సద్వివేక
వతులు వర్థిల్ల విజ్ఞతన్ భావితరము
పరుగు పెట్టుచు భాతితో పయనమగును.//
