ॐॐॐ
गुरुर्विना न लभ्यते ज्ञानवर्धनम् ll
🪷బాలచంద్రోదయము🪷
ఉత్పలమాలాలంకృతము... 🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
పన్నగ శాయి! శ్రీ హరి! ప్రభాతము నయ్యె అయోధ్య రామ! నీ
కన్నుల జూఁడు మమ్ముల వికాసము నీయఁగ చిత్తమందు మా
కన్నుల గాంతివీవె ఘన గాత్ర! వికుంఠ విరాజరాజ! యో
చెన్నుడ! రావణారి! తలి చెంతన నిల్చెను నీదు సేవకై
మున్నుగ ముద్దులీయుచు, విబూదిని సౌఖ్యపు మోక్ష మీయరా!
వెన్నెల సోన నీముఖము వేకువ ఝామున వెల్గుచున్నదే!
మిన్నున వేచె దేవతలు మేలిమి సీతయె చొప్పడంగ ని
న్నెన్నగ మా తరంబ! ఘనమెవ్వని కీర్తిని దానవారినిన్!
వెన్నున నాటలాడుమయ ప్రేమకు నీ ప్రతి సాటిలేరయా!
హొన్నుమనంబు నీది చని, యూయల లూగర తల్లి చేలమున్
వన్నెల తోయజాక్షిఁగను భాగ్యము ముందల నుండెరాఘవా!
పెన్నిధి నీవె ప్రోచు నరివీరభయంకర! రాజశేఖరా!
కిన్నెర సాని సోయగము కింకర నాశక! సీత వాల్జడన్!
నన్నుల మిన్న జానకియె ! యాపద గూల్చెడి ధర్మరక్షకా!
చెన్ను మొగంబుఁ దీనజన శ్వేతపు చిత్త మనోభిరాముడా
పన్నుల జీవదాత! వెసఁ బ్రార్ధన లేలర బాలచంద్రుడా!
దన్నుగ నాంజనేయు నిను త్రాతగ గొల్చుచు నీడనుండగా
పున్నెము నిన్నుజూఁడ రఘుపుంగవ! గౌతమ పత్ని పోష! నే
నన్నము పానముల్ విడచి యార్తిని యాదవ పూజితా! నినున్
దిన్నగ జేరుకుందు గను! తాటక మర్దన! భక్తి భావమే
నన్ను, నినున్ విభూదియడగంగను నీ వర మీయు మయ్య సం
పన్నుల యందు జూచు పని వద్దు యనన్,సుర సేవితా! ప్రజా
సన్నుత! జంగమాగమము సద్హృదయాంగము శాశ్వతమ్ముగా
చెన్నుగ నీదు జూడ్కులకు జిత్తము సిధ్ధము నెల్లవేళలన్
వన్నెల జానకీ లలన వైభవ మందున వెల్గు చుండ నీ
కిన్ని వసంతరాత్రులివి యిద్దరి మధ్యన ప్రేమపెంచెనే
ఇన్నియు జెప్పి యుంటి గొను మింకను మంగళ శాసనంబు మీ
కన్నువ బెంచు, జంట గని హారతి నిత్తురు సర్వదేవతల్!!
✍️చావలి బాలకృష్ణవేణి
౧౯/౬/'౨౫
హైదరాబాద్..