అన్నమయ్య
అన్నమయ్య
అన్నమయ్య
(తేటగీతి మాలిక )
హరికి భక్తుడై వెలిగెనీ యన్నమయ్య
పరమ వైష్ణవ తేజమై ప్రభవమొంది
చిఱుత ప్రాయంబు నవెడలి తిరునగరికి
శ్రీనివాసుని నిల్పితా జిత్తమందు
వేల కీర్తనల్ రచియించె విభుదుడతడు.
హరికరంబున మెఱిసెడి యాయుధంబు
నందకంబీ ధరణి యందు నడచి వచ్చి
పలు తెఱంగుల విష్ణుని పట్టి కొలిచి
యాలపించె నా కీర్తనలమిత భక్తిఁ
శ్రీనివాసు డన్నయ్యతో చనువు నెఱపి
వినుచు మురిసితా దనువును విస్మరించె.
తొలిపదంబును పాడిన తెలుగు కవిగ
జనుల హృదయాల నిలిచె దాసప్రముఖుడు.
రగడ లందున తేనెను రంగరించి
మేలుకొల్పులన్ జోలలు బాలగోప
మణికి హారతుల్ పట్టుచు మహిమ తెలుపు
లీల లెన్నియో వ్రాసిన లెంక యతడు.
గేయరచనలో మేటిగా కీర్తినొంది
పరమ పథమును చేరెనా భక్తవరుడు.
పదకవిత్వంబు కాద్యుడై వరలినట్టి
యన్నమయ్యను వంశజులనుసరించి
విష్ణు మూర్తిని కొల్చుచు వినతి కెక్కి
సంప్రదాయము నిల్పిన సచ్చరితులు.
కారణ జన్ముడౌ యన్నయ్య కలియుగమున
తెలుగు సాహితీ వనములో దివ్యమైన
పారిజాతసుమము వోలె పరిఢవిల్లె.
తల్లి భారతి చరణాల తలను వాల్చి
నవ్య సాహితీ యుగముకు నాంది పలికి
మార్గదర్శియై నిలిచిన మహితశక్తి
యన్న మయ్యకు నిత్యము హారతులిడి
భక్తి మీరగ చేసెద వందనములు //
