అమ్మా
అమ్మా
అమ్మ చేతి ముద్ద ఎంతొ .. మధురమౌను చిన్నారికి
అమ్మ ఒడి ఎంతొ భద్ర పీఠమౌను చిన్నారికి
అమ్మపాడు జోలపాట...హాయినిచ్చి నిద్రపుచ్చు
అమ్మపిలుపు మమతపంచి .. హ్లాదమౌను చిన్నారికి
ఉన్నచోట ఉండకుండ..
పరుగుతీయు బుడ్డోడికి
అమ్మకంటి చూపె కాచె..కవచమౌను చిన్నారికి
ఆటలాడి అలసిపోయి ... స్తబ్దుగున్న బుజ్జాయిని
ఊరడించి ముద్దుచేస్తె మురిపెమౌను చిన్నారికి
నీళ్ళువోసి లాలిపాడి..గుడ్డలేసి తలనుదువ్వి
మురిసిపోవు అమ్మంటే...చిత్రమౌను చిన్నారికి
కనుకాటుక వేలతీసి .. బొట్టుపెట్టి దిష్టితీసి
మెటికలిరువ... మంత్రమౌను చిన్నారికి
కన్నయ్యా..!! యనిపిలువా..పరుగునొచ్చి
చుట్టుకున్న
ఎత్తుకుంటె హత్తుకుంటె మోదమౌను చిన్నారికి
చిన్నదెబ్బ తగిలితేనె..తట్టుకోదు అమ్మమనసు
కలతనొంది నొచ్చుకుంటె ..ఖేదమౌను చిన్నారికి
జన్మనిచ్చి బతుకునిచ్చి..నడకనేర్పి నడతనేర్పు
'మధు'వాణీ..అమ్మేగా..సర్వమౌను చిన్నారికి
