మరదలి మనస్సు
మరదలి మనస్సు
కలిసుండే కమనీయము కడుమోదము
మనమైత్రి అరుణోదయం మనజంట అజరామరం
కన్నుల వెన్నెల కాంతులు మెరువగ
మోవిన నవ్వుల పువ్వులు పూయగ
చెక్కిలి నొక్కుల సిగ్గుల మొగ్గన
నాసిక పుటములు అదిరెను సఖుడా
ఘనమై వేణియె అడుగగ పూవులు
తురమగ రావా మూరెడు మల్లెలు
చారెడు చెంపకు ముద్దుగ తేవా
ముత్యము లద్దిన బంగరు సరాలు
శంఖము బోలిన నామెడ నందున
నీవుగ నిలువగ తాళిని గట్టిగ
కట్టగ రావా కలిమిని పంచగ
నిరతము కొలువగ నిన్నే గురుతుగ
గజ్జెలు ఘల్లన ఉల్లము ఝల్లని
భావా వేశము తనువును ఊపెనె
బావా నీవిక నాదరి చేరుము
మోహా వేశము నిండెను మదినే
