శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

వృత్తిదేవోభవ

వృత్తిదేవోభవ

2 mins
155


           

                   

   స్కూల్ డ్రెస్ లో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎంతో నేర్పుగా పోయిన చెప్పులను కుడుతూ రూపు దిద్దుతుంటే... ఎంతో ఆశ్చర్యంతో పాటు ముచ్చటగా చూశాను. ఆ కుర్రాడి ముఖం చూస్తే అతని పనితనం లాగే చదువు కూడా చదువుతాడనిపించింది. చదువుకునే ఆ విద్యార్థికి చెప్పులు కుట్టే దుస్థితి ఎందుకు వచ్చిందోనని నాలో చిన్న చింత చేరింది. ఎందుకో ఆ కుర్రాడి గురించి తెలుసుకోవాలనే ఆతృతతో... "నువ్వు చదువుకుంటున్నావా బాబు" అంటూ పలకరించాను.

   

  శ్రద్ధగా పని చూసుకుంటున్న ఆ కుర్రాడు ఒకసారి తల పైకెత్తి.. ముఖాన నవ్వు పులుముకుంటూ "అవును సార్ ఆరో తరగతి చదువుతున్నాను" అని ఎంతో వినయం గా చెప్పి తిరిగి తన పనిలో లీనమయ్యాడు.

   “అయితే చదువు కోసం ఈ పని చేసుకుంటూ నీ సంపాదనతో చదువుకుంటున్నావా” అని అతని పరిస్థితిని ఊహిస్తూ అడిగాను.

    నా ప్రశ్నకు చిరునవ్వు నవ్వుతూ... తల అడ్డంగా ఊపాడు. “లేదు సార్ మా అయ్యకి తను రోజంతా కష్టపడి చెప్పులు కుట్టిన సంపాదనతో నన్ను బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుడ్ని చేయాలని ఆశ. కష్టపడి మా అయ్యే నన్ను కాన్వెంట్ లో వేశాడు. నాకోసం రోజంతా మా అయ్య పడే కష్టం చూడలేక... బడి అయిపోయాక మా అయ్యను ఇంటికి వెళ్ళమని చెప్పి నేనే ఈ పని చూసుకుంటూ ఉంటాను. ఎంతైనా తరతరాల నుంచి వస్తున్న మా వృత్తిని గౌరవించడం నా విధి. చదువుకుంటున్నాను కదాని ఈ వృత్తిని అసహ్యించుకుంటూ దూరంగా ఉంటే... రేపు ప్రొద్దుట నేను ఎంత పెద్ద చదువు చదివినా... మా అయ్య ఆశించినట్టు నాకు ఉద్యోగం రాకపోవచ్చు. ఇప్పుడే నాకీపని చేతిలో ఉంటే పెద్దయ్యాక పస్తులు పడాల్సిన కర్మ రాదు కదండీ ”.. నా చెప్పులు కుడుతూనే తన భవిష్యత్తు గురించీ... తన వృత్తి గురించి ఎంత తీయగా నాకు వినిపించాడు.

      ఆ కుర్రాడి మనసుద్ధికి చేతులెత్తి మొక్కాలనిపించింది నాకు.

     ఈరోజుల్లో పెద్ద చదువులు చదువుతూ...పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా...తమ తండ్రుల కాయకష్టంతో పైకి వచ్చామన్న సంగతే మర్చిపోయి... తన తండ్రి చేసే వృత్తిని చిన్న చూపుగా భావించి... వారిని నలుగురి మధ్య కు తీసుకువస్తే తమ ప్రెస్టేజీకి భంగం వాటిల్లుతుందని చాటుమాటునే ఉంచేస్తున్నారు. ఎటువంటి స్వార్థబుద్ధి లేని ఆ కుర్రవాడి కన్నతండ్రి ఎంతో అదృష్టవంతుడు అనిపించింది నాకాక్షణంలో.

     ఆ కుర్రాడు అందించిన నా పాత చెప్పులు ఎంతో కొత్తవిగా కనిపించి... కృతజ్ఞత గా చూస్తూ... ఆ కుర్రవాడి కష్టానికి ప్రతిఫలాన్ని అందించాను.*

( 20.4.1990 హారిక సచిత్ర వారపత్రికలో కథావిన్యాసం శీర్షికన ప్రచురించిన కథ)

పునః ప్రచురణ 13.9.2019


Rate this content
Log in

Similar telugu story from Drama