తరంమారింది
తరంమారింది
"నీవు నా భార్య గా లభించడం నా అదృష్టం నవ్వుతూ కూడా నన్ను వదిలి వెళ్లకు రా"
అదే మాట రాజేశ్వరమ్మ చెవులో మారు మోగు తోంది...
"పోరా ఆ మాట నేనే అనాలి నువ్వు నా జీవితంలోకి రాక పోయుంటే నా బ్రతుకు కి అర్థమే ఉండేదికాదు"
ఇలా ఇంకా ఏదో తనలో తనే మాట్లాడు కుంటున్న రాజేశ్వరమ్మ ని గుమ్మం లోనుంచి చూసిన కొడుకు ప్రసాద్ , కోడలు సుభద్ర కి ఆశ్చర్యం కలగలేదు. నాన్న గంగాధరం చనిపోయిన ఈ మూడేళ్ల నుంచి వాస్తవాన్ని జీర్ణించకోలేక అప్పుడప్పుడు ఇలా తనలో తనే ఎదురుగా గంగాధరo ఉన్నట్టు గానే భ్రాంతి తో రెండు మూడు నిముషాలు మాట్లాడుకుని
ఎవరైనా పిలిచాక తేరుకుని దుఃఖిస్తుంది.
గంగాధరం రాజేశ్వరమ్మలది ఏభై సంవత్సరాల అన్యోన్య దాంపత్యం. మూడు సంవత్సరాల క్రితం గంగాధరం గుండె పోటు తో మరణించాక అప్పటి వరకూ అన్ని విధాలుగా మహారాణి లా గడిపి న రాజేశ్వరమ్మ కి ఒక్కసారిగా శూన్యం లోకి ఎవరో నెట్టేసి నట్టైంది. కొడుకు ప్రసాద్ కోడలు సుభద్రమ్మ తనతో ఉన్నా అప్పుడప్పుడు ఒంటరిగా ఉద్వేగానికి లోనౌతూ వుంటుంది రాజేశ్వరమ్మ. గత 50ఏళ్ల కాపురం లో చాలా అనుభవమే గడించిదని చెప్పాలి. ఒక్క సారిగా గతం అంతా కళ్ల ముందు మెదిలింది....
రాజేశ్వరమ్మ గంగాధరం దంపతులకి ఒక్క గా నొక్క కొడుకు ప్రసాద్ . గంగాధరం లెక్కల మాస్టారు గా మంచి పేరు సంపాదించాడు. కొద్దో గొప్పో వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. రాజేశ్వరమ్మ గంగాధరం బావా మరదళ్ళే. రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు లేకున్నా ఇష్టపడి పెద్దల ని ఒప్పించి చేసుకున్నారు. ఒక రకంగా ఆ కాలంలో లోనే ప్రేమ వివాహం అనుకోవచ్చు. రాజేశ్వరమ్మ BA Hon. యూనివర్సిటీ మొదటి రాంకు సాధించింది. చదువు అయి పోగానే ఉపాధ్యాయు రాలిగా కేంబ్రిడ్జ్ కాన్వెంట్ లో చేరింది. కానీ ఉద్యోగం లో చేరిన రెండేళ్లకే గంగాధరం తో
పెళ్లి కాగానే ఇల్లాలు పోస్ట్ కే అంకితం అయి పోయింది.
ఓర్పు నేర్పు తో బాటు రాజేశ్వరమ్మ కి అటు సాంప్రదాయాల పట్లా కుటుంబం పట్ల అవగాహన ఆదరణ రెండూ ఉండటం తో అందరకీ ఆవిడ అంటే ఎంతో గౌరవం ప్రేమ. ప్రసాద్ కి సుభద్ర తో పెళ్లైంది. సుభద్ర కి ప్రసాద్ తో పెళ్ళైన మొదటి పది సంవత్సరాలు రాజేశ్వరమ్మ ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది. ప్రసాద్ సుభద్ర ల పెళ్లి ఒకసారి గుర్తు చేసు కుంది రాజేశ్వరమ్మ..... షుమారు ముప్ఫై సంవత్స రాల క్రితం...
గంగాధరం, రాజేశ్వరమ్మ హాల్లో కూర్చొని కులాసాగా ఏవో కబుర్లు చెప్పు కొంటున్నారు. అప్పుడే బయటి నుంచి వచ్చిన ప్రసాద్ మెల్లిగా అమ్మా నాన్న దగ్గరికి వచ్చి ఏదో చెప్పా లన్నట్టు నీళ్ళు నములు తున్నాడు. రాజేశ్వరమ్మ కి ముందే విషయం కొంచెం తెలుసు కాబట్టి కొడుకు తో
"చెప్పరా! చల్ల కొచ్చి ముంత దాయట మెందుకు" అనగానే
"అది కాదు నాన్నా! నాకు సుభద్ర అంటే చాలా ఇష్టం సుభద్ర కి కూడా నేనంటే"..
"సుభద్ర ఎవరు? ఆమె తల్లి తండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు?" అడిగాడు గంగాధరం.
"బ్యాంక్ మేనేజర్ విశ్వ నాధం గారి అమ్మాయి"
"రేపు ఒకసారి విశ్వనాధం ని నేను కలిసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళి విషయం లో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కూడా తెలియాలి" అన్నాడు.
మరుసటి రోజు గంగాధరం విశ్వ నాధం ని కలిసి వచ్చాక రాజేశ్వరమ్మ తో
"విశ్వనాధం ని కలిశాను". అన్నాడు.
"ఏమన్నారు" అడిగింది రాజేశ్వరి.
"సుభద్ర వాళ్ళ కన్న కూతురు కాదు. వాళ్ళకి పిల్లలు కలగక పోతే అనాధ శరణాలయం నుంచి తెచ్చు కున్నారట"
ఏ మాట్లాడాలో తెలియక వీడ్ని రెండు తగిలిస్తే సరిపోతుంది అని ఇంకా రాజేశ్వరి ఏదో అనబోతుంటే..
"ఆ విషయం సుభద్ర కి కూడా తెలియ కుండా పెంచారట. సుభద్ర కి సంభందించినంత వరకూ విశ్వనాధం విజయ లే ఆమె తల్లి తండ్రులు."
"అంటే కులం, గోత్రం.. జాతకాలు ఇవి ఏవి ఉండే అవకాశ మే లేదు."
"ఏమో నోయ్! నేనంత చిన్నగా ఆలోచించ లేక పోతున్నా. వాళ్లు అంత ఆదర్శ వంత మైన పని చేస్తే మనం మాత్రం ఇంకా అక్కడే ఉండటం న్యాయం అనిపించట్లేదు."
"ఓహో! ఇంకేం ఒప్పేసు కుని వచ్చారా?"
"ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసు కుంది? నీకు ఇష్టం లేనిది నేను ఎప్పుడైనా ఒప్పుకున్నానా? అంతే కాదు విశ్వనాథం మరో విషయం కూడా స్పష్టంగా చెప్పారు."
"ఇంకా ఏముంది చెప్పేందుకు?" రాజేశ్వరి అడిగింది.
"ఎటువంటి పరిస్థితులలోనూ ఈ విషయం చర్చించటానికి కానీ సుభద్ర కి తెలియటానికి గానీ వీలు లేదు అన్నాడు. ఆ కండిషన్ కి అంగీకారం అయితేనే మాట్లాడు కుందాం అన్నాడు." చెప్పాడు గంగాధరం.
ఒక్కగానొక్క కొడుకు కోరిక తోసిపుచ్చలేక పెళ్ళికి ఒప్పుకున్నారు రాజేశ్వరి, గంగాధరాలు.
అంతే ఆ తరువాత ఎప్పుడూ ఈ విషయం మళ్ళీ ఎప్పుడూ ప్రస్తావన కి రాలేదు. అన్ని విషయాల్లోనూ సుభద్ర ఆ కుటుంబం లో కలిసి పోయింది. గంగాధరం రాజేశ్వరమ్మకి తగిన కోడలు అని ప్రసాద్ కి అన్ని విధాలుగా తగిన భార్య అని అందరూ అంటారు.
ప్రసాద్ కి తల్లి తండ్రుల పైన ప్రేమ, అభిమానం ఇంత అని చెప్పలేం. కలియుగం లో శ్రావణ కుమారుడు లాంటి వాడు. సుభద్రకి మొదట్లో అది నచ్చేది కాదు.
ఏ వండాలి అంటే అమ్మని అడుగు అంటాడు ఎన్ని రోజులైనా. అదే దారిలో వాళ్ల ఒక్క గా నొక్క కొడుకు అఖిల్ కూడా అన్ని వాళ్ల మామ్మ చెప్పినట్టే చేస్తాడు.
మొదట్లో సుభద్ర కి రాజేశ్వరమ్మ చాలా టిపికల్ గా అనిపించేది. అన్ని పనులూ రాజేశ్వరమ్మే స్వయంగా చేసేది . అది ఇల్లు శుభ్రంగా ఉంచడమే కావచ్చు, వంటే కావచ్చు, అతిథులను చూడటమే కావచ్చు అన్నిట్లో రాజేశ్వరమ్మ ముద్ర ఆ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రవారం వస్తే అందరికీ తలంటి పోసి ఇల్లు కడిగి అప్పుడు కానీ వంట మొదలు పెట్టేది కాదు. ఆవిడ చేస్తుంటే ఆవిడకి కావలసినట్టు సహకరించి చెప్పినట్టు చేయడమే సుభద్ర పని. ఏ పండగ వచ్చినా హడావిడి అంతా అత్తయ్యదే. మొదట్లో చాదస్తంగా అనిపించేది. కానీ మెల్లిగా అత్తయ్య దే కరెక్ట్ అని ఇప్పుడు అన్నిట్లో తన లాగే ఉండాలని సుభద్ర తపన. మనవడు అఖిల్ ని పదో తరగతి వరకూ దగ్గరుండి చదివించింది. మామ్మ, మనవడు ఎక్కువ ఇంట్లో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడు కునే వాళ్ళు.
ఇప్పుడు అఖిల్ కి కూడా 23 ఏడ్లు వచ్చాయి. గత సంవత్సరమే ఏదో కంపెనీ లో సాప్ట్ వేర్ టీమ్ లీడ్ గా చేరాడు.
మూడు సంవత్సరాల క్రితం గుండె పోటు తో గంగాధరం మరణించి నప్పటి నుండి రాజేశ్వరమ్మ దిన చర్య లో పెద్ద మార్పే వచ్చింది. మెల్లిగా అన్ని పనులూ కోడలు సుభద్ర కే అప్పజెప్పి ఎక్కువ భాగం తన గదికే పరిమితం అవు తోంది . ఉదయాన్నే స్తోత్రాలు చదువుకోవటం, భక్తి టీవీ లో వచ్చే కార్యక్రమాలు చూడటం సాయంత్రం లాన్స్ లో కూర్చొని ఇయర్ఫో ఫో న్స్ తో సంగీతం వినటం .. ఇలా గడిచి పోతోంది.ఎప్పుడో తప్ప కొడుకు కోడలు వ్యవహారంలో కలుగ జేసు కోదు రాజేశ్వరమ్మ.
హాల్లో కొడుకు, కోడలు అఖిల్ తో ఏదో గొడవ పడుతున్నారు. రాజేశ్వరమ్మ కి స్పష్టంగా నే
వినబడు తున్నాయి.
"అసలు వాళ్లు ఎవరు? మనం ఏమిటి మన సంప్రదాయం ఏమిటి? పైగా మాతో మాట మాత్రం అయినా చెప్ప కుండా వాళ్ళని మనింటికి రమ్మనట మేమిటి? ఇప్పుడు అత్తయ్య కి ఈ సంగతి ఎలా చెప్పాలి? వాళ్ళకి ఏ చెప్పి పంపించాలి మనవడు చేసిన ఈ నిర్వాకానికి " అరుస్తోంది సుభద్ర.
ఎప్పుడూ సుభద్ర అంత పెద్దగా మాట్లాడి ఎరుగదు.
అనుకోని ఈ పరిణామానికి ఏమనాలో తెలియక
"ఒరేయి నీ వయసేమిటి నీకు ఈ ప్రేమ ఏమిటి
ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల లోనూ జరగదు వాళ్ళని గుమ్మం లోకి రాగానే నేనే వెళ్ళ గొడతా" పైకి అలా అన్నా ప్రసాద్ మనసులో షుమారు ముప్ఫై సంవత్స రాల క్రితం జరిగిన సంఘటన గుర్తు కొచ్చింది.
ఆ మాట విన్న అఖిల్ "అప్పుడు ఏ చేయాలో మేం నిర్ణయించు కుంటాం.." అన్నాడు.
"చూసారా.. చూసారా ఎంత మాట పడితే అంత ఇప్పుడే మాట్లాడుతున్నాడు అని ఆవేశంగా
అఖిల్ దగ్గరికీ వెళ్ళ బోయిన సుభద్ర ని గదిలోంచి అన్ని విన్న రాజేశ్వరమ్మ
"ఇప్పుడు మీరు వాడి మీద అవేశ పడినందు వలన ఆగేది ఏది లేదు ముందు ఆ వచ్చే వాళ్ళతో కర్ర విరగ కుండా పాము చావ కుండా మా అబ్బాయి కి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు MS చేయిద్దాo అనుకుంటున్నాం అని చూడండి. మన ఇంటి పరువు మర్యాద పోకుండా మెల్లిగా పరిష్కరించు కోవాలి ఇలాంటివి." అని చెప్పి లోపలికి వెళ్లి పోయింది రాజేశ్వరమ్మ.
మరునాడు సాయంత్రం నాలుగు గంటల సమ యంలో ఎర్ర మారుతీ బెలినో లో రేఖ , రేఖ తల్లి తండ్రులు వచ్చారు. రేఖ తండ్రి వెంకటప్పయ్య, తల్లి పావని అనుమానంగా ఏదో భయ పడుతూనే లోపలికి వచ్చారు. సుభద్ర కాఫీ ఫలహారాలు ఏర్పాటు చేసి నిశ్శబ్దంగా ఉన్న హాల్లో మెల్లిగా పరిచయ వాక్యాలు మొదలు పెట్టింది.
అప్పుడు గదిలో నుంచి రాజేశ్వరి వచ్చిన వాళ్ళని తేరి పార చూసి
"వీడు.. వీడు మా వెంకటప్పయ్య కదూ .. నువ్వూ పావని అని చెప్పబోతుంటే ఇద్దరూ రాజేశ్వరమ్మ కాళ్లకి దండం పెట్టీ....
"అదే మేము అనుమానం గానే అడుగు పెట్టాము. మాష్టారు ఏరీ? అని వెంకటప్పయ్య అడగ బోతుంటే.
"మీ సార్ నన్ను వదిలి పెట్టీ వెళ్లి పోయారు. ఇంకా ఎందుకో భగవంతుడు నన్ను ఇలా వదిలి పెట్టాడు." అంది రాజేశ్వరమ్మ.
ప్రసాద్ తల్లి దగ్గరి కొచ్చి "నాన్న ఎక్కడున్నా మనల్ని చూస్తూనే అంటారు." అని అనునయంగా అమ్మని దగ్గరికి తీసుకుంటాడు.
అఖిల్ కూడా మామ్మ దగ్గరి కి రావటం తో రెండు మూడు నిముషాలు వాతావరణం గాంభిరంగా ఉండి పోయింది. ఆ నిశ్శబ్దాన్ని తుంచేస్తూ
సుభద్ర
"అత్తయ్యా! అయితే వీళ్ళు మీకు ముందే తెలుసా" అంది
"తెలియటం ఏమిటి వీళ్లిద్దరూ మీ మామ గారి దగ్గరికి ట్యూషన్ కి వచ్చేవాళ్ళు. వీళ్ళ వాలకం ముందే గమనించి వీళ్ళని జాగ్రత్త గా చూడమంటే ఆయన వింటేనా.. చివరికి ఆయనే దగ్గరుండి ఇద్దరి తల్లి తండ్రులని ఒప్పించి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆయన ఉంటే ఎంత సంతోషించే వారో."
"అత్తయ్య గారూ మీతో కొంచెం మాట్లాడాలి." అని రాజేశ్వరమ్మ ని సుభద్ర పక్క గది లోకి తీసుకెళ్ళింది.
అన్నీ విన్న రాజేశ్వరమ్మ వెంకటప్పయ్య, పావని లాంటి మంచి వారి సంబంధం మీరు వెతికినా దొరకదు. నా మనవడు మన పేరు నిల బెట్టాడు. ఇంకేం మాట్లాడ కండి మంచి రోజులు రాగానే ముహూర్తం పెట్టించు కోండి అని కోడలికి సర్ది చెప్పి అఖిల్ పెళ్లి దగ్గరుండి చేయించింది.
మరో మూడు సంవత్సరాలు దొర్లిపోయాయి. అఖిల్ కి విఘ్నేష్ పుట్టాడు. గంగాధరమే మళ్లీ పుట్టాడని అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు.
కొత్త కోడలు రేఖతో సుభద్ర కి ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగు తూనే ఉంది. రేఖ ఉదయం 9గంటలకి వెళ్ళి రాత్రి 7గంటలకి వస్తుంది హైటెక్ సిటీ నుంచి రోజూ. ఏ పనీ లోకి రాదు ఏ రోజు కా రోజు స్విగ్గి తో బయట నుంచి తెప్పించుకుని తినటం అలవాటు చేసుకుంది. రేఖ కి సహనం, సర్దు బాటు రెండూ తక్కువే . ఒక రకంగా ఆ ఇంట్లో కలుపు మొక్కే. అయిందాని కి కాని దానికి అందరి మీద చిర్రు బర్రు లాడి, అత్తగారు సుభద్ర మీద ఒంటి కాలుతో లేస్తుంది. సుభద్ర సమాధానం గట్టిగానే చెబుతోంది. రాజేశ్వరమ్మ కి సుభద్ర ని ఎలా వెనకేసుకు రావాలో తెలియక కళ్ల తోనే రేఖ ని హెచ్చ రించడం నిత్య కృత్యం అయిపోయింది. అసలు వెంకటప్పయ్య పావనిల కూతురు ఇలా ఉండటం రాజేశ్వరమ్మ కి ఆశ్చర్యం గానే ఉంది. తరం మారింది, పెత్తనం అంతా రేఖ చేతులోకి మారిపోయింది. సుభద్రకి ఆరోగ్య సమస్యలు రాజేశ్వరమ్మ కి ముసలి తనం అందుకు బాగా సహకరించాయి.
ప్రసాద్, అఖిల్ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండి పోవటం తప్ప ఎటూ చెప్ప లేని పరిస్థితి. ఒక పక్క ఉద్యోగం, మరోపక్క విఘ్నేష్ చంటి పిల్లాడు. వంట అన్నిటి తో వేగ లేక రేఖ ఒక వంట మనిషి ని, చంటి పిల్లాడిని చూడ టానికి ఒక ఆయాని ప్రవేశ పెట్టింది. నిజానికి పిల్లవాడిని చూసే సహనం కానీ అనుభవం కానీ సదరు ఆయా గా వచ్చిన ఆ పిల్లకి ఉన్నట్టు అనిపించలేదు. ఆమె మొబైల్ వదిలి పెట్టిన సమయం చాలా తక్కువ. అలా నిరంతరం మాట్లాడు తూనే ఉంటోంది ఒకటి రెండు సార్లు చెప్పినా పలితం లేక పోయింది. ఈ నెల వరకూ ఎలాగో అలా కొన సాగించి కొంచెం ఓపిక రాగానే మాన్పించాలి అని సుభద్ర ఆలోచన.
సమయం సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది. రాజేశ్వరమ్మ ఇంటి ముందు లాన్స్ లో కుర్చీ లో కూర్చొని ఏదో పుస్తకం చదువు తోంది. ఒక ఇరవై అడుగుల దూరంలో బేబీ సిట్టింగ్ ట్రాలీలో ముని మనవడు విఘ్నేష్ ఆ ట్రాలీ ని వయ్యారంగా పట్టుకుని మొబైల్ ఫోన్ లో బహుశా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ తనలో తానే నవ్వు కుంటూ మెలికలు తిరుగు తోంది. ఆ చంటి పిల్లాడు వింటాడనో, రాజేశ్వరమ్మ కి వినబడు తోందనుకుందో విఘ్నేష్ నీ ఆ బండిలో వదిలి పది అడుగులు దూరం వెళ్ళింది ఆయా. ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు గోధుమ రంగు లో ఉన్న త్రాచు పాము ఆ ట్రాలీ ని చుట్టుకుని పైకి ఎక్కే ప్రయత్నం చేస్తోంది. దూరం నుంచి గమనించిన రాజేశ్వరమ్మ ఒణికి పోయి ఒక కేక పెట్టి మెరుపు లా వెళ్లి ఆ ట్రాలీ ని పక్కకి జరిపింది. కానీ ఆ అలజడికి పాము పోతూ పోతూ రాజేశ్వరమ్మ కాలు తాకి కాటు వేసింది.. అంతే అయిదు నిముషాల్లో నురగలు కక్కుకున్న రాజేశ్వరమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయింది.
ఆయా భయం తో గోడ దూకి పారి పోయింది. అనుకోని ఈ సంఘటన కి విషాదం కమ్ముకుంది. ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ సంఘటన కి రేఖ నిశ్చేష్టు రాలైంది. షాక్ నుంచి తేరు కోవడానికి చాలా రోజు లే పట్టింది. తన కన్న కొడుకు విఘ్నేష్ ని కాపాడి రజేశ్వరమ్మ విష సర్పానికి బలైన తీరు కలిచి వేసింది. రేఖ ప్రవర్తన లో చాలా మార్పు వచ్చింది. మునుపటి దుడుకుదనం పూర్తిగా పోయింది. ఇప్పుడు సుభద్రకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మారింది.
"ఏ పాత్ర ప్రయోజనం ఏమిటో సృష్టించిన వాడికే తెలుసు" అంటే ఇదే నేమో!
రచయిత .. మిథున్

