శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

తప్పటడుగు

తప్పటడుగు

4 mins
298


ఆ ఇంట్లో పెళ్ళిజరిగినా...అదంతా సందడిలా అనిపించలేదు.ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరగబోతున్నట్లుగా అధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి.


కొడుకు దగ్గర ఓడిపోయి...బంధువుల ముందు తలెత్తుకోలేక తల వంచుకుని మరీ ఈ పెళ్లి చేసింది ఒక్కగానొక్క కొడుక్కి.


కొత్త కోడలు తన ఇంటి గడపదాటి లోనికి అడుగు పెడుతుంటే...శాంతి నవనాడులూ క్రుంగిపోయాయి.


తన పెంపకంలో కొడుకు తనకిదికావాలని ఏనాడూ అడగలేదు.ఏమీ అడక్కుండానే కొడుకు మనసెరిగి అన్నీ సమకూర్చేది.అలాగే కొడుక్కి ఓ లక్షణమైన సంబంధం కుదిర్చి ...మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్ళిచేసి...కోడల్ని తనింటి గడపలో అడుగుపెట్టించి స్వాగతం పలకాలనుకుంది.అనుకున్నవన్నీ జరగవేమో...?


పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయే కావాలని మంకుపట్టి మరీ ఈ పెళ్లి చేసుకున్నాడు.భార్యతో పాటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా వీడితో కలుపుకోవాలి.వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈడ్చుకొస్తాడో అనే చింతే.... శాంతిని ఎక్కువుగా కలవరపెడుతుంది.


అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. కంటిపై కునుకు రావడం లేదు.కొడుక్కీ తనకీ మధ్య మధ్య వచ్చిన వాదన ఎంతవరకూ సబబో అర్థం కావడంలేదు.జరిగినదంతా పీడకల అయివుంటే బావుండేది.ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి.


భర్త పోయాకా...కొడుకే సర్వస్వంగా బ్రతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురైంది...


"అమ్మా నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమెను తప్ప నేనెవరినీ పెళ్లి చేసుకోను" ఖరాఖండిగా చెప్పాడు తల్లితో పవన్.


అదిరిపడింది శాంతి. తన చెవులను తానే నమ్మలేకపోయింది. అమ్మాయి వివరాలు తెలిసాకా మరింతగా కృంగిపోయింది.


తమ కులం కాకపోయినా మంచిసంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించివుంటే ఒప్పుకునేదేమో...? ఓ పేదింటి పిల్లైనా దయతో ఆదుకునేదేమో...? ఆ రెండూ కాదు. అందుకే...శాంతి కొడుకు ప్రేమని నిరాకరించింది.


"ఆ అమ్మాయిని మరిచిపో. నీ కోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి. మన పరువూ మర్యాదా నిలబెట్టాలంటే...నేను చూసిన అమ్మాయిల్లో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్ళిచేసుకో. అంతే గానీ ఈప్రేమాదోమా అంటూ మనకుటుంబ మర్యాదలు మంటగలపకు". కొడుకును శాసించింది శాంతి!


తల్లి మాటలకు మరింతగా పౌరుషం పొడుచుకొచ్చింది పవన్ కి.


"అమ్మా ఆ అమ్మాయికి అందం లేదా? చదువు లేదా? ఉద్యోగం లేదా? ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాల పట్టింపులేంటి? ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా! నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరొకరితో పెళ్లి చేస్తానంటే నీ తృప్తికోసం చేసుకుంటాను గానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను.నీ వల్ల నాతోపాటూ నువ్వు పెళ్లి చేసే అమ్మాయీ, నేను ప్రేమించిన అమ్మాయీ కూడా జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాము. ఇలా నీకిష్టమైతే చెప్పు...నీ ఒక్కదానివైనా సంతోషంగా ఉండొచ్చు"-తల్లితో చెప్పదల్చుకుంది చెప్పేసి...గదిలోకి వెళ్లి భళ్ళున తలుపేసేసాడు తల్లికి మరో మాట అవకాశమీయకుండా!


కొడుకు మాటలు మరింత భయపెట్టాయి శాంతిని.లోపల యే అఘాయిత్యం చేసుకుంటాడోనని.... తలుపులు బాదుతూనే వుంది పిచ్చితల్లి.


తెల్లారేకా తలుపులు తెరుచుకోడంతో....ఊపిరి పీల్చుకుని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి.


పుట్టింటి వారికీ, అత్తింవారికీ కూడా కొడుకు నిర్ణయం చెప్పి ...ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నానని... తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి.


బంధువర్గమంతా శాంతినే తప్పుపట్టారు.కొడుకుని సరిగా పెంచలేదని,పూర్తిగా స్వేచ్చనిచ్చి భయమన్నది లేకుండా చేసావని ఏవేవో ధూషించారు. ఈ పెళ్ళికి మేము రాలేమని కొందరూ, ముహూర్తసమయానికి వస్తే వస్తామని కొందరూ జవాబిచ్చారు.శాంతి వారినంతగా రమ్మని బలవంతపెట్టదల్చుకోలేదు.బంధాలకు విలువిచ్చి వారికీవిషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది గనుకే వారి మాటలను మౌనంగా భరించింది శాంతి.


పెళ్ళైన మూడురోజుల తర్వాత...భార్య పుట్టిల్లైనా అత్తవారింట అడుగు పెట్టాడు పవన్. పెద్దింటోళ్ల అబ్బాయి వారింటికి అల్లుడుగా రావడం పరమానందంగా వుంది.తమ కూతురి అదృష్టానికి పొంగిపోయారు.


"మన అనితమ్మ మారాజులాటి కుర్రాడ్ని మనువాడింది కాబట్టి సరిపోనాదిగానీ మనమిట్టాంటి కుర్రగాడ్నిచ్చి కట్టబెట్టగమా చెప్పు"? పెళ్ళాం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న.


"నువ్వు మరీ మావా! మన అనితమ్మకేటి తక్కువేటి? తినో తినకో ఎంతో కట్టంతో పట్నంలో మనబిడ్డని సదివించాం. ఆ సదువుకి సరిపడే ఉజ్జోగం కూడేసుకుంది కాబట్టే ...మన బిడ్డ యెంట పడ్డాడు మనల్లుడు. మన పిల్ల అందానికి యే మగాడైనా ఎగరేసుకుపోతాడు.అయినా మనల్లుడి అమ్మ తనకిట్టం లేకుండా ఈ మనువు చేసింది.దాని కాడికి ఈళ్ళిద్దర్నీ కాపురానికి పంపితే మన బిడ్డ నెట్టా చూత్తదో యేటో....? ఈ పెళ్లి సేయడానికి మనల్ని చూత్హూనే మొహం యేలాడేసింది".


"వామ్మో...!మన పిల్లని అత్తనుంచి వేరుకాపురమెట్టించాలి. అల్లుడెలాగూ మనోడు అయి పోనాడు.కూతురింటికి మనంకూడా పోతావత్తా ఉండొచ్చు". కళ్ళింతింత చేసుకుని చెప్తున్న రత్తాలు మాటల్ని మురిపెంగా వింటున్నాడు వెంకన్న.


తెల్లారి...కూతురుకి అన్నివిషయాలు నూరిపోసింది.. అత్త నుంచి వేరుకాపురామెలా పెట్టాలో.


కన్నవాళ్లను అమాయకంగా చూసింది అనిత.

  

"అమ్మా అవన్నీ నాకు తెలుసుగానీ...అయ్యా, నువ్వూ,తమ్ముడూ మాతోపాటే వుండాలి. ఇప్పటివరకు మీరుపడ్డ కష్టం చాలు.లోను తీసుకుని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం"అంటూ వారి ఆశలకు దారి చూపిస్తుంది.


కూతురు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఆ కన్నవాళ్లకు. పనీ పాటా లేకుండా బలాదూరుగా తిరుగుతున్న కొడుకు బ్రతుకెలా సాగుతుందోనన్న దిగులు కాస్తాపోయి... కూతురి ఆదరణ వారిలో కొత్త ఊపిరిని నింపాయి.


వెంకన్న మరిక ఆగలేదు."ఈ సంతోష సమాయాన్న మనగూడెం కొండమ్మతల్లికి గొర్రిపోతుని మొక్కి నాటుసారాతో పండగసేసుకోవాల"అంటూ భుజంపై తుండుగుడ్డను సవరించుకుంటూ...బయటకు దారి తీసాడు.


పవన్ వాళ్లింట్లో వుండటానికి కొంచెం ఇబ్బంది ఫీలైనా కొత్తపెళ్ళాం బాధ పడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు. రాను రాను వారిమధ్య అలవాటు పడిపోతాననుకున్నాడేగానీ సాధ్యం కావడంలేదు.వారి వారి వేషభాషలు చాలా రోతగానూ,జుగుప్సాగానూ వున్నాయి. శుచీ, శుభ్రం లేకుండా చిందరపందరగా పడివున్న వస్తువులూ...చుట్ట కంపులూ...వారంతా వచ్చి తమదగ్గరే తిష్ఠవేయడం అసలు నచ్చడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యనైతే భరించొచ్చు గానీ... ఆమె కుటుంబంతో బంధం అవమానంగానూ, అష్యంగానూ అనిపిస్తుందిప్పుడు.అదంతా తన భార్య తనవారికిచ్చిన స్వేఛ్చని అర్థమైంది.


రోజురోజుకీ మానసికంగా కుమిలిపోతున్నాడు...పవన్. ఆరోజు అమ్మ చెప్పింది నిజమే."అందరిలోనూ రక్తం ఎర్రగానే వుంటుంది. అంతమాత్రాన్న మనుష్యులంతా ఒకేలా వుండరు.వారి కులాన్నిబట్టి...ప్రాంతాన్ని బట్టి... వారి వారి నడవడికలు,వేషభాషలు,కట్టుబాట్లు,పద్దతులూ రకరకాలుగా ఉంటాయి.నువ్వు పెరిగిన తీరు వేరు... ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు. ఇద్దరూ కలిసి ఒకే తాటి మీద నడవగలమని నువ్వనుకుంటున్నావు గానీ... తప్పటడుగు వేస్తున్నావని నేనెంత చెప్పినా నీకర్థం కావడంలేదు".అంటూ గుండెలవిసేలా అమ్మ ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసెందుకు కరడు కట్టిందో...? నా భవిష్యత్తు బుగ్గిపాలు కాకూడదని అమ్మ ఎంతగా అల్లడిపోయిందో...? అప్పుడు అమ్మ మాటలను పెడచెవిన పెట్టబట్టే ...ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. మనసులో అమ్మ మాటలు వినబడుతుంటే....పశ్చాత్తాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకుని...అమ్మ ఒడిలోకి వాలిపోవాలని తపించిపో తున్నాడు పవన్.


ధైర్యాన్ని కూడదీసుకుని బయటకు నడిచాడు...."నాన్నా నేనూ వత్తాను" అంటూ అప్పుడే మాటలొలుకుతున్న కూతురు వెంటపడుతున్నా..."ఎక్కడికి వెళ్తున్నావు"అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్.


ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టే అమ్మ....పండుగ పబ్బాలకు ఎంతో నిష్ఠగా పూజలు చేసి ప్రసాదాలు పెట్టే అమ్మ...బయటకు వెళ్తుంటే నుదిటిన బొట్టుపెట్టి క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని ఎదురువచ్చే అమ్మ...ఆలస్యంగా ఇంటికి వెళ్తే తనకోసం ఎదురుచూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ...చిన్న జలుబు చేసినా అర్థరాత్రి కూడా నోట్లో మందు వేసే అమ్మ గుర్తుకొస్తుందిప్పుడు పవన్ కి.


బంధువుల సానుభూతిని,దెప్పిపొడుపు మాటలను తట్టుకునే శక్తి లేక...కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సివస్తుందో అనే భయంతోనూ...ఊరికి దూరంగా ఉన్న శాంతిఆశ్రమంలో దైవస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుందిప్పుడు శాంతి.


తల్లిని వెతుక్కుంటూ వెళ్లిన పవన్ కి-ఆమెను చూడగానే చంటిపిల్లడిలా ఒడిలో పడుకుని బావురుమని ఏడవాలనిపించింది.


కొడుకుని చూసిన ఆ తల్లిలో...ఎప్పటిలా అదే వాత్సల్యం,అదే ఆదరణ,అదే ప్రేమ!


"అమ్మా నాకిక నువ్వే కావాలమ్మా" అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది."వొద్దు బాబూ! ఇప్పుడు నువ్వొక్కడివే కాదు.నీకొక కుటుంబం వుంది.వారికి అన్యాయం చేయకు.నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేసివుంటే...నీతోపాటూ ఆ అమ్మాయీ, నువ్వు ప్రేమించిన అమ్మాయీ కూడా బాధపడతారని చెప్పావు.అలాంటి అనర్థాలకు తవివ్వకూడదనే మీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను గెలిపించడం కోసం ...నేను ఓడిపోయి నీవిష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేసి...మనవాళ్ళందరికీ దూరంగా ఈ శాంతిఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను".


"నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాకా నువ్వు ఇలాంటి పని చేస్తే ఆదేవుడు కూడా క్షమించడు.


"చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఏం లాభం?

కాలిన గాయానికి మందు వేసుకోడం తప్ప !

గతం గతః".

కొడుకు నుదుటిపై ప్రేమగా ముద్దాడి...వెనక్కి పంపించింది శాంతి.


తల్లి దీవెనతో....పవన్ తన భార్యాపిల్లలతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే గానీ...తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు - ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి మనుమడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బ్రతికిన తన తండ్రి,తాత ల పేర్లు రచ్చకెక్కడంతో తమ వంశానికి కళంకం తెచ్చి మాయని మచ్చ చేశానని మనసులో కుమిలిపోతూనే వున్నాడు - పవన్.


Rate this content
Log in

Similar telugu story from Drama