తల్లిదండ్రులు
తల్లిదండ్రులు
అదేంట్రా అలా అంటావ్. తల్లిదండ్రుల గురించి అలా అనకూడదు. తప్పు కదూ అన్నాడు వినీత్.
నీకేంట్రా మీ నాన్న నీకు డొనేషన్ కట్టి మంచి కాలేజీలో సీటు ఇప్పించారు. నాకేమో ఆ కన్వీనర్ కోటాలో ఏదో చెత్త కాలేజ్ వస్తే దానికే వెళ్ళమంటున్నారు అని వాపోయాడు సురేష్.
అలా కాదురా. డబ్బులు కూడా చూసుకోవాలి కదా అన్నాడు వినీత్.
లేదులేరా. మా అమ్మా నాన్నలకు నా మీద అంత ఇష్టం లేదు. ఉంటే ఎలాగైనా సరే మంచి కాలేజీలో చేర్పించి ఉండేవారు. డబ్బు సమస్య ఎప్పుడూ ఉండేదే. కానీ.. అంటూ నసిగాడు సురేష్.
ఏమోరా. మనం తల్లిదండ్రులు అయిన తరువాతే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని పెంచారో అర్థం అవుతుంది అట. అది అనుభవంలోకి వస్తే వారు మన కోసం ప్రతి క్షణం చేసే త్యాగాలు అర్థమవుతాయి అని మా నాన్న అంటూ ఉంటారు అన్నాడు వినీత్. అతడు ఇంటికి వెళ్లిపోయాడు.
సురేష్ ముఖం ఇంకా కోపంగానే ఉంది. ఆ రాత్రి అమ్మా నాన్నలతో గొడవ పెట్టుకుని అన్నం తినలేదు అతను.
అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న. సురేష్ పుట్టడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఎంత మంది దేవుళ్ళకు మొక్కారో. ఎన్ని ఆస్పత్రులు తిరిగారో. అది విన్న తరువాత సురేష్ కి సిగ్గుగా అనిపించింది.
అతడే అన్నం కలుపుకుని వచ్చి ముద్దలు చేసి అమ్మా నాన్నలకు తినిపించాడు. ఎలాంటి కాలేజీ అయినా తన వంతు చదువు పట్ల శ్రద్ధగా ఉండి జీవితంలో పైకి రావాలని నిశ్చయించుకున్నాడు.
