Rama Seshu Nandagiri

Drama

4  

Rama Seshu Nandagiri

Drama

తల్లి దండ్రులు

తల్లి దండ్రులు

3 mins
262


"ఏరా అలా ఉన్నావ్" మామయ్య అడిగారు శ్రీకాంత్ ని.


 శ్రీకాంత్ బి.టెక్ చేసి కేంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు. ఉద్యోగం దొరకడం కష్టం, వెంటనే జాయిన్ కమ్మని నాన్న, పై చదువులు చదువుతానని తను భీష్మించుకుని ఉన్నారు.


"మామూలే మామయ్యా. నేనడగడం, నాన్న కాదనడం, అమ్మ ఆయన్ని సపోర్ట్ చేయడం. కొత్తేముంది?" విసుగ్గా అన్నాడు శ్రీకాంత్.


"అది కాదురా, ఒకసారి వాళ్ళ మాట కూడా వినొచ్చు కదా. వాళ్ళు ఇన్నాళ్లు నువ్వడిగినవన్నీ ఇచ్చారు. నువ్వు కూడా అర్థం చేసుకో." అనునయంగా అన్నారు మామయ్య.


"ఏంటి మామయ్యా, నువ్వు కూడా. అందరూ నాకు చెప్పే వాళ్ళే.

అదేదో వాళ్ళకి చెప్పొచ్చు కదా. నన్ను అర్థం చేసుకోమని." ముఖం గంటు పెట్టు కొని అన్నాడు శ్రీకాంత్.


"ఒరేయ్, అన్నీ ఉన్న నీకు లేని బాధ తెలియదు రా. తల్లి దండ్రుల విలువ నన్నడుగు చెప్తాను. పుట్టిన రోజున తల్లిని, మరో రెండు సంవత్సరాలకు తండ్రిని పోగొట్టుకున్న వాడిని.

అన్నా, వదినల అజమాయిషీ లో, అక్కా, బావల ఆదరణలో పెరిగిన వాడిని." అన్నారు మామయ్య కొంచెం ఉద్వేగంతో.


"ఏం వాళ్ళు నిన్ను బాగా చూడలేదా." ఆశ్చర్యంగా అడిగాడు

శ్రీకాంత్.


"అలా అంటే నాకు పుట్ట గతులుండవ్. తల్లి దండ్రుల కన్నా

మిన్నగా పెంచి ప్రయోజకుడిని చేశారు." అన్నారు మామయ్య.


"మరి నీకేం కష్టం కలిగింది." ఆరాగా అడిగాడు శ్రీకాంత్.


"ఒక్క విషయం చెప్పరా. నిన్ను మేమంతా ముద్దుగా చూస్తాం. కానీ నీక్కావలసింది వాళ్ళనడుగుతావా, మమ్మల్నా." అడిగారు మామయ్య.


"వాళ్ళనే అడుగుతాను. ఇఃకెవర్నో ఎలా అడుగుతాం. ఎంత బాగా చూసినా బాగుండదు కదా.." అంటూ నవ్వేశాడు శ్రీకాంత్.


"కదా. అదే మరి. అమ్మా నాన్న అంటే. చూడు నీకు కొన్ని విషయాలు చెప్తాను విను." అంటూ ఆగారు మామయ్య.


శ్రద్ధగా వినసాగాడు శ్రీకాంత్ మామయ్య ఏం చెప్తారో నని.


"సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమ. ఆమె ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. నవమాసాలు మోసి, అన్ని రకాల సేవలు చేసి‌ మన నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరదు అమ్మ." కొంచెం ఆగి


"మన జీవితంలో తొలి స్పర్శ తల్లిది ఆమె తరువాతనే మన జీవితంలో ఎవరు ప్రవేశించినా ఆమె తరువాతనే. చివరికి తండ్రి కూడా ఆమె ద్వారానే పరిచయం." అన్నారు మామయ్య.


"అంతగా ప్రేమించే అమ్మ, నాన్న మాటే ఎందుకు వినమంటుంది? నేనంటే ప్రేమ ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయాలి కదా." అడిగాడు శ్రీ కాంత్.


"తల్లి నవ మాసాలు కడుపున మోస్తే తండ్రి 25 సంవత్సరాల వరకు గుండెలపై పెట్టుకుంటారు. ఆడపిల్ల నైతే పెళ్లి అయ్యేదాకా

కంటికి రెప్పలా కాపాడి, ఆ తరువాత కూడా ఆమె సుఖ దుఃఖాలు తన గాంభీర్యం మాటున దాచుకుంటారు." ఆగారు మామయ్య.


"చూశావా, నువ్వే అన్నావుగా, నాన్నకి అక్కంటేనే ఇష్టం. తనేమడిగినా చేస్తారు. తనకిష్టమైన చదువు, పెళ్ళి అన్నీ. అదే నేనైతే ఎన్నో కథలు చెప్తారు." ఉక్రోషంగా అన్నాడు శ్రీకాంత్.


"కొడుకైతే ప్రయోజకుడై, ఒక ఇంటి వాడయ్యే వరకు, కొడుకు బాధ్యత వహిస్తారు. అతని కష్టసుఖాలను తనవి గా భావిస్తారు. అతని గెలుపుకు లోలోన పొంగిపోతారు. ఓటమి యొక్క బాధను మౌనం మాటున దాచుకుంటారు." మామయ్య శ్రీకాంత్ ని నిశితంగా చూశారు.


శ్రీకాంత్ మౌనం వహించాడు. మామయ్య మాటలు అతనిని కదిలిస్తున్నాయి.


"అటువంటి తల్లి దండ్రులకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఇంతటి అనుబంధం పెనవేసుకొని ఉన్న తల్లి దండ్రుల మాటల్ని పట్టించుకోకుంటే ఎలా?" మామయ్య శ్రీకాంత్ ముఖం లో మారుతున్న భావాల్ని గమనిస్తూ కొంతసేపు ఆగారు. శ్రీకాంత్ మౌనాన్ని ఆశ్రయించాడు


"ఎటువంటి బంధమైనా తల్లిదండ్రుల, పిల్లల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఇవ్వకూడదు. చదువు లేక ఉద్యోగ రీత్యా కొన్ని వేల మైళ్ళ దూరాన ఉండవచ్చు. కానీ మానసికంగా ‌తల్లి దండ్రులకు పిలిస్తే పలికే దవ్వున ఉండాలి." మామయ్య కాస్త ఆగి కొన సాగించారు


"ఏ‌బంధమైనా జీవితం లో కోల్పోతే తిరిగి పొందగలం. కానీ తల్లి అనే పేగు బంధం మరలా జన్మ ఎత్తినప్పుడు మాత్రమే పొందగలం. ఒకసారి ఆమెను పోగొట్టుకుంటే మరు జన్మ వరకు ఆ బంధాన్ని తిరిగి పొందలేము."


శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మామయ్య వైపు దీనంగా చూశాడు, మాటలు రాని వాడిలాగా. శ్రీకాంత్ మనసును అర్థం చేసుకున్న మామయ్య తన మాటను కొనసాగించారు


"అదేవిధంగా నాన్న అని జన్మనిచ్చిన తండ్రి ని తప్ప వేరెవరినీ ఆ విధంగా పిలిచి తృప్తి చెందలేము. 'అమ్మా' అని ఎవరినైనా నోరారా పిలవగలమేమో కానీ 'నాన్న' అనే భావన మరెవరిని చూసినా మనసులో మొలకెత్తదు. అంతటి విభిన్నమైన వ్యక్తిత్వం నాన్నది."


"నిజం మామయ్యా. నువ్వు చెప్తుంటే అన్పిస్తోంది, నేనెంత తప్పుగా ఆలోచించానో." కళ్ళనిండా నీళ్ళతో అన్నాడు శ్రీకాంత్.


"ఈ ప్రపంచం లో తల్లి దండ్రుల ప్రేమను పొంది, వారి విలువను కానలేక విస్మరించిన వారున్నారు. పొత్తిళ్ళలో ఉండగానే వారి ప్రేమకు దూరమై అలమటించే వారెందరో ఉన్నారు. తల్లి దండ్రులను, వారి ప్రేమను కోల్పోతే తిరిగి పొందలేం. కనుక వారి మనసు కష్ట పెట్టే ముందు కాస్త ఆలోచించాలి."  శ్రీకాంత్ నే చూస్తున్నారు మామయ్య.


"మామయ్యా, నువ్వు చెప్పింది నిజం. నేనే మూర్ఖంగా, వాళ్ళని బాధ పెట్టాను." అన్నాడు బాధగా


" చూడు శ్రీ, వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు.వారు మనని ప్రయోజకులను చేయడానికి ఎంతో కష్ట‌ పడతారు. మనని గుండెలపై పెట్టుకొని పెంచిన వారిని ఏ కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత." ఇంతటితో తాను చెప్పేది అయిపోయింది అన్నట్లు మౌనం వహించారు మామయ్య.


"మామయ్యా, నీ నుండి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసు కున్నాను. ఇవి నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అమ్మ, నాన్నల మాట కాదనను. వారు ఎంతో అనుభవంతో చెప్తున్నా రని అర్థం అయింది. నిజంగా నీకు చాలా ఋణపడి ఉన్నాను." అన్నాడు మామయ్య చేతులు కనులకద్దుకుంటూ.


మామయ్య కూడా శ్రీకాంత్ ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama