తల్లి - బాధ్యత
తల్లి - బాధ్యత
మిమ్మల్ని సంధ్యా మేడమ్ పిలుస్తున్నారు అని చెప్పడంతో నేను మా మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాను.
ఇరవైల్లో ఉన్న నేనే ఆఫీసుకు వచ్చి పోయే హడావిడిలో సగం పనులు మరచిపోతాను. అసలు నాకు రెట్టింపు వయసు ఉన్న ఈవిడ ఇంట్లో పనులు చూసుకుని మళ్లీ టంచనుగా ఆఫీసుకి వస్తుంది. అన్ని మీటింగ్స్ లో ఆవిడ సమయస్ఫూర్తితో ఇచ్చే ఆన్సర్లు చూసి మేము యాంకర్ సుమతో పోలుస్తాము.
మేడమ్ అని లోపలికి వెళ్ళగానే కూర్చోమని సైగ చేసింది. ఫోనులో మాట్లాడ్డం అయిపోగానే నన్ను పలకరించింది.
రచనా! ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? అని అడిగింది.
నేను ప్రెగ్నెన్సీ తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ జాబ్ లో జాయిన్ అయ్యి ఆరు నెలలు గడిచింది. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈవేళ ఇలా అడిగింది అని అనుకున్నాను.
మేడమ్! టెస్టింగ్ అయిపోయింది. క్వాలిటీ టీమ్ నుంచి అప్రూవల్ రాగానే మనం.. అంటుంటే నన్ను ఆపమని సైగ చేసింది.
నేను మీ బాబు గురించి ఫ్యామిలీ గురించి అడిగాను రచనా అంది.
మేడమ్. అదీ. అంతా బాగానే ఉంది. కానీ.. అని ఆగాను.
పర్లేదు చెప్పండి రచనా అని అడిగింది ఆమె.
తల్లిగా నా బిడ్డకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది మేడమ్. అప్పుడప్పుడూ. అంతే. ఇంట్లో ఎవరికి చెప్పినా జాబ్ మానెయ్యమంటారు. కానీ నేను జాబ్ చేసేది కూడా నా బిడ్డకు మరింత మంచి భవిష్యత్తు నిర్మించుకునే అవకాశాలు ఇవ్వగలను అనే అని ఆగాను.
నిజమే ఈ రచనా. ఈ సందేహం చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న తల్లులకు ఉండేదే. నేను అర్థం చేసుకోగలను.
మీరు ఇచ్చిన చిల్డ్రన్ డే కేర్ సెంటర్ ఐడియా మేనేజ్మెంట్ కి నచ్చింది. కానీ కొద్దిగా టైమ్ పట్టొచ్చు. మీరు మీ బాబుని ఇక్కడికే తీసుకురావచ్చు. మన కంపెనీ స్టాఫ్ ను కూడా ఇచ్చి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. మధ్య మధ్యలో కాసేపు బాబుని చూసి తిరిగి పని చేసుకోవచ్చు అని చెప్పింది. ఇది మిగతా వారు కూడా ఆనందంగా స్వాగతించారు అంది.
థాంక్స్ మేడం అని నా ఆనందాన్ని చిరునవ్వు జోడించి తెలిపాను.
బయటికి వచ్చి నా క్యాబిన్ వైపు నడుస్తున్నాను. పిల్లలు ఆడుకునే శబ్దాలు వినిపించాయి.
తొందరలో ఇది నిజం కావాలి అని కదిలాను.
