సమయం మించిపోతోంది
సమయం మించిపోతోంది
మళ్లీ అలారం మోగింది. అదిగో సూరీడు. బుల్లెట్టు బండి ఎక్కి వచ్చినట్లు ఉన్నాడు. తెల్లారగానే ఎంత హడావిడి. ఎన్ని శబ్దాలు. మనుషులు. పనులు.
నిన్నటి బోకులు తోమలేదు. అబ్బా ఈ ఫ్లష్ సంగతి మరచిపోయాను. ఈవేళ సాయంత్రం ఖచ్చితంగా బాగు చేయించాలి. పెర్ఫ్యూమ్ అయిపోయింది. చూసుకోవాలి కదా.
గుడి గంటలు. అమ్మో హారతి టైమ్ అయిపోయింది. పరుగో పరుగు.
అన్నా అని ఆర్డర్ చెప్పేంతలో..
ఇదిగో నీకోసం పెసరట్టు ఉప్మా అని అనౌన్స్మెంట్. అబ్బా నేను ఉల్లి మినప తిందాం అనుకున్నా అని నిట్టూర్పు.
మళ్లీ టైమ్ చూసుకున్నాను.
పంచ్ టైమ్ కి వెయ్యకపోతే ప్రతొక్కడూ మన అటెండెన్స్ మీద వేసే పంచ్ లైన్లు వినాల్సి వస్తుంది.
ఇంతకీ నా ఫేస్బుక్ పోస్టుకు లైకులు రావట్లేదు. పోతే పోనీ. అమ్మో. లంచ్ తొందరగా తినెయ్యాలి.
వర్కు. అవును ఎప్పుడు ఏ వర్కో మరి. జీతం డబ్బులు ఇచ్చే వర్కు.
అయ్యా. బట్టలు నానబెట్టలేదే. హతవిధీ. రోజుకో సినిమా చూసి తొంగోడం కాదు. బట్టల గురించి కూడా ఆలోచించాలి. రేపటికి నా పరిస్థితి ఏమిటి.
మరీ అండర్వేర్ మీద ఆఫీసుకు రాలేం కదా. మంచి పర్సనాలిటీ ఉంటే వెళ్లొచ్చు. అద్దంలోంచి ఎవరో గొణిగినట్లు వినిపించింది. ఇప్పుడు అద్దం పగలగొట్టేంత పెద్ద పనులు పెట్టుకోకూడదు. అసలే ఆఫీసు వాళ్ళ అద్దం.
ఆఫీసు అవగానే మళ్లీ టిఫిన్. బట్టలు నానబెట్టి, అవి ఫ్యాన్ కింద ఆరబెట్టి, నేను కొంచెం గుర్రుపెట్టానా.
మళ్లీ అలారం మోగింది. సూరీడు వచ్చేశాడు. కాలచక్రం ఇలా తిరగేస్తోందేంటి చెప్మా.
సమయం మించిపోతోంది. వయసు ముప్పై కి ముద్దు పెట్టింది. ఇంకా ఎన్ని చేయాలి. ఎన్ని తెలుసుకోవాలి.
ఇంతకీ చక్కెర కేళీ అమృత పాళీ రెండూ తియ్యగానే ఉంటాయా.. అబ్బా రేపు చూద్దాం..
