రిటైర్మెంట్
రిటైర్మెంట్


ఒక వైపు వేదిక. ఆహుతుల చేతుల్లో పూల దండలు.కొత్త శాలువాలు.
మరో వైపు ఆఫీసు క్యాంటీన్లో ఘుమఘుమలాడే వంటల తయారీ.
ఆఫీసు సిబ్బంది అంతా కృష్ణ మూర్తి గారి పదవీ విరమణ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణ మూర్తి భార్యా సమేతంగా పెద్ద కుర్చీలో కూర్చొని ఆఫీసు ఇబ్బంది వేస్తున్న దండలు కప్పుతున్న శాలువాలు స్వీకరిస్తున్నాడు.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కాలం అదే ఆఫీసులో గడిచిపోయింది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆఫీసు పాలసీల సవరణ చేశాడు.
అందరితోనూ మంచిగా ఉండి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
రిటైర్మెంట్ ఫంక్షన్ లో అతడికి ఒకే ఒక విషయం బాధ అనిపించింది.
ప్రభుత్వంలో ఒక భాగమైన ఉద్యోగం ద్వారా ఎంత మందికో సేవ చేశాడు.
చాలా మంది అతని గురించి గొప్పగా మాట్లాడారు.
తృప్తిగా అందరూ తిని ఇళ్లకు వెళ్లారు.
ఆ రోజు రాత్రి కృష్ణ మూర్తి వాళ్ళ అమ్మ గారి ఫోటో చూస్తూ కూర్చున్నాడు.
ఏమైందండీ అని అడిగింది ఆయన భార్య.
సుచిత్రా! ఇది మనకు వానప్రస్త సమయం.
మా అమ్మను చివరి రోజుల్లో దగ్గరగా ఉండి చూసుకోలేదు.ఇక ఇప్పుడు నాకు ఏ బాధ్యతలూ లేవు.
మన పిల్లలు బాగా సెటిల్ అయ్యారు.
నాకు ఏదయినా ఆశ్రమంలో ఉండే వృద్ధులకు చేతనైనంత సహాయం చేయాలని ఉంది అని అన్నాడు.
సుచిత్ర భర్త మనసును అర్థం చేసుకుంది.
తొందరగా పడుకోండి.రేపు ఉదయం మనం వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ మనం ఎలా సాయం చేయగలమో మాట్లాడి వద్దాం అని అంది.
ఎన్నో ఏళ్ల తరువాత కృష్ణ మూర్తి కళ్ళలో తడి.అతడు ఆనందంగా నిద్రపోయాడు.
మరుసటి రోజు అతడికి వేయి సూర్యుల కాంతితో ప్రకృతి తనకు శుభోదయం చెప్పినట్లు అనిపించింది.