పురాణ కథలు - సమస్య - పరిష్కారం
పురాణ కథలు - సమస్య - పరిష్కారం
ఎప్పుడూ ఆ పురాణాల గురించి చెప్పడం తప్ప ఇంక వేరే పనీ పాటా లేదు అని విసుక్కున్నాడు కిరణ్. పక్కింటి పెద్దాయన రోజూ పురాణాల్లోని శ్లోకాలూ అవీ చదువుతూ ఉంటాడు.
సాయంత్రాలు కిరణ్ డాబా మీద ఉన్నప్పుడు ఆ పెద్దాయన చదివే విషయాలు వినిపించేవి.
అసలు ఈ పురాణాలూ అవీ మరీ విడ్డూరం. దేవతలు, రాక్షసులు, మంత్రాలూ మాయలూ. అసలు పనికి వచ్చే విషయాలేనా అవన్నీ అని అన్నాడు కిరణ్.
పెద్దాయన చిన్నగా నవ్వుకున్నాడు. నేను చెప్పేది వింటావా అని అడిగాడు ఆయన. కిరణ్ కాదని అనలేదు.
అరుణాసురుడనే రాక్షసుడిని శక్తి స్వరూపము అయిన అమ్మవారు భ్రమర రూపములో వధియించినది. రెండు కాళ్ళు, నాలుగు కాళ్ల జీవులచే వధించబడకూడదు అని వరం పొందిన అరుణాసురుడు ఆరు కాళ్ళు కల భ్రమరాలచే వధించబడ్డాడు.
అయితే అన్నాడు కిరణ్.
పెద్దాయన మళ్లీ చెప్పసాగాడు. వివిధ రకాలుగా మృత్యువు పొందకుండా వరం పొందిన హిరణ్యకశిపుడు నరసింహ స్వామిచే వధించబడ్డాడు.
నేనడిగింది ఇది కాదు అన్నాడు కిరణ్.
బాబూ! పురాణ కథ అయినా హ్యారీ పోటర్ అయినా నువ్వు గమనించాల్సిందే గమనించాలి. దాని నుండి నేర్చుకోవాల్సింది వెతకాలి.
జీవితంలో కష్ట సుఖాలు సహజం. అరుణాసురుడైనా మరే అసురుడినయినా నువ్వు నీ జీవితంలోని సమస్యతోనో లేక నీలోని చెడు అలవాటుతో పోల్చి చూడు.
సమస్యలు వచ్చాయని కృంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దనీ, ప్రతి సమస్యకూ పరిష్కారం ఖచ్చితంగా ఉందనీ, పోరాడమని మాత్రమే పురాణాలు చెబుతున్నాయనుకో. సమస్యను తెలివిగా సమర్థవంతంగా పరిష్కరించ మంటున్నాయనుకో.
అనుకోవడం కాదు. అలానే అర్థం చేసుకో.
మరణం అనివార్యమని అవి బోధిస్తున్నాయి. దుష్ట శిక్షణ జరిగి తీరుతుంది అని మనకు చెబుతున్నాయి.
మాయా మంత్రం అంటావా. ప్రకృతే దైవ స్వరూపం. ప్రకృతే మాయ. నాకు తెలిసినంతవరకూ సకారాత్మక అంశాల్ని మనం పురాణాల నుంచి తీసుకోగలగాలి అని చెప్పి కిరణ్ సమాధానం కోసం చూశాడు.
కిరణ్ ఎందుకో తలూపాడు. ఇలాంటి విశ్లేషణ అతను ఎప్పుడూ వినలేదు. పెద్దాయన నవ్వుకుని పుస్తకంలో మునిగిపోయాడు.
